ఫలించిన తల్లి న్యాయ పోరాటం.. కస్టోడియల్ డెత్‌పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
తాజాగా కేసు నమోదు చేసి త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలి.. దర్యాప్తును సీనియర్ సీబీఐ అధికారికి అప్పగించాలి
బాధ్యులైన పోలీసు అధికారులను గుర్తించి ప్రాసిక్యూట్ చేయాలి
సాయికృష్ణ తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని బాబు సర్కార్‌కు ఆదేశం
ఈ కేసులో రాష్ట్ర పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే అవకాశం లేనే లేదు
సిట్ విశ్వసనీయతను కూడా శంకిస్తున్నాం..
ఈ కేసులో పోలీసులపై తీవ్రమైన ఆరోపణలున్నాయి
సాయికృష్ణను అక్రమంగా నిర్భంధించారు
కస్టడీలోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరచలేదు.. కస్టడీలో పోలీసుల దారుణ హింస కారణంగానే చనిపోయాడు
మా ముందున్న ప్రాథమిక ఆధారాలు ఇదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.. కస్టడీ మరణాల్లో సీబీఐదర్యాప్తునకు ఆదేశించడం కోర్టుల బాధ్యత
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించదగ్గ అసాధారణ పరిస్థితులు ఈ కేసులో ఉన్నాయి
89 పేజీల తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఖాకీల కర్కశత్వానికి బలైపోయిన తన కుమారుడి కోసం ఓ తల్లి చేసిన న్యాయ పోరాటం ఫలించింది. కనీసం బూడిద కూడా దొరకుండా తన కుమారుడిని అత్యంత అమానవీయంగా కస్టడీలో దారుణంగా హింసించి చంపేసిన ఘటనపై ఆ తల్లి మొరను హైకోర్టు ఆలకించింది. తన కుమారుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని వేడుకుంటూ మృతుడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై రాష్ట్ర పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే అవకాశం లేనే లేదని తేల్చి చెప్పింది. సిట్ విశ్వసనీయతను కూడా తాము శంకిస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ కస్టడీ మరణానికి సంబంధించి తక్షణమే కేసు నమోదు చేసేలా చూడాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ దర్యాప్తును సీబీఐకి చెందిన ఒక సీనియర్ అధికారికి అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు బాధ్యులైన అధికారులను గుర్తించడంతోపాటు సాయికృష్ణ తల్లికి రూ.25 లక్షలను నష్టపరిహారంగా చెల్లించాలని చంద్రబాబు సర్కార్‌ను ఆదేశించింది. నేటి నుంచి నాలుగు వారాల్లో ఆ మొత్తాన్ని ఆమె ఖాతాలో జమ చేసి తీరాలని తేల్చి చెప్పింది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించిన అన్ని రికార్డులను ప్రత్యేక మెసెంజర్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందచేయాలని డీజీపీని ఆదేశించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు కారణమైన అధికారులపై సర్వీసు నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం శుక్రవారం 89 పేజీల సంచలన తీర్పు వెలువరించింది.
పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..
‘కోర్టుకు సమర్పించిన రికార్డుల్లోని ఆధారాలు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం.. మృతుడు సాయికృష్ణని 06.05.2026 ఉదయం సుమారు 7 గంటలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. మొదట స్టేషన్ సెంట్రీకి, ఆ తర్వాత అతడిని మొబైల్ ఫోన్‌తో సహా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకి అప్పగించారు. అతడిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమైనదే అయినప్పటికీ, బీఎన్ఎస్ఎస్ చట్టం కింద నిర్దేశించిన వ్యవధి లోపు సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం లేదు. అదే సమయంలో అతడిని కస్టడీ నుంచి విడుదల కూడా చేయలేదు. తద్వారా పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది’ అని ధర్మాసనం పేర్కొంది.
పోలీసుల దారుణ హింస వల్లే చనిపోయాడు...
‘అంతేకాకుండా విచారణ సమయంలో సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ, డిజిటల్ ఆధారాల ప్రకారం మృతుడు చట్టం అనుమతించిన పరిమితికి మించి పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. కస్టడీలో సాయికృష్ణపై హింస జరిగిందని, తద్వారా అతడికి స్పష్టంగా కనిపించే గాయాలయ్యాయని తేలింది. అతడు చివరిసారిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సజీవంగా కనిపించాడు. కస్టడీలో దారుణ హింస కారణంగా తీవ్రమైన గాయాల పాలై మరణించాడు.
విచారణలో తేలిన విషయమేమిటంటే.. 19.06.2026న కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఎన్వీఆర్ ప్రాథమిక ఫోరెన్సిక్ పరిశీలనలో సాయికృష్ణ కస్టడీలో ఉన్న కీలక సమయానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు, దానికి ముందు ఉన్న 18 నెలల ఫుటేజ్ కూడా అందుబాటులో లేదని తేలింది. ఇది ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా పూర్తిగా నాశనం చేయడాన్ని స్పష్టంగా సూచిస్తోంది.’ అని ధర్మాసనం తేల్చింది.
మృతదేహం గురించి కూడా సిట్ తెలుసుకోలేకపోయింది..
‘08.05.2026 నుంచి 26.05.2026 మధ్య కాలంలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తులు, గుర్తుతెలియని శవాలకు సంబంధించిన వివరాలను ప్రైవేటు ఆసుపత్రుల రికార్డులతో సహా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల వల్ల సాయికృష్ణ మృతదేహాన్ని గుర్తించడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఎలాంటి సమాచారం లభించలేదు.
ఈ కోర్టుకు సిట్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లోని 14వ పేరా ప్రకారం సాక్షుల విచారణలో భాగంగా సాయికృష్ణకు లాకప్‌లో చికిత్స అందించిన ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను విచారించారు. 08.05.2026న అతను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణను పరీక్షించారు. అతని శరీరంపై అనేక చోట్ల గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు. పోలీసు సిబ్బంది తనపై దాడి చేసినట్లు మృతుడు స్వయంగా తనకు వెల్లడించారని ఆ డాక్టర్ దర్యాప్తు అధికారులకు చెప్పారు’ అని తీర్పులో ధర్మాసనం ప్రస్తావించింది.
ఆధారాలన్నీ కస్టోడియల్ డెత్‌గా నిర్ధారిస్తున్నాయి...
‘మృతుడి కస్టడీ, అతడి శారీరక స్థితి, ఆ తర్వాత వేరొక వ్యక్తి అతడి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేలా పోలీసులు చేయడం... నేరం జరిగిన గది రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు లాంటి కీలక అంశాలను, సాంకేతిక, మెడికల్, ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ధ్రువీకరించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలను కూడా ఇవి ప్రాథమికంగా రుజువు చేస్తున్నాయి. వీటన్నింటి ఆధారంగా సాయికృష్ణది పోలీసుల కస్టడీలో జరిగిన మరణంగా తేలింది.
అంతే కాదు అతడి మృతదేహం లేదా దాని అవశేషాలు ఇంకా లభించలేదని కూడా నిర్ధారణ అయింది. కోర్టు ముందున్న ఆధారాలు.. సాయికృష్ణ కస్టడీ హింసకు గురయ్యాడని, పోలీసు కస్టడీలోనే మరణం సంభవించిందని, మృతదేహాన్ని కూడా మాయం చేశారని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని పిటిషనర్ విజయలక్ష్మీకి తెలియజేయలేదు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 22(1), (2) కింద సాయికృష్ణకు లభించిన ప్రాథమిక హక్కును హరించడమే’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించదగ్గ అసాధారణ పరిస్థితులున్నాయి...
‘ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ఆదేశించడానికి తగ్గ అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. వాటి విషయంలో మేం సంతృప్తి చెందాం. ఇది కస్టడీ హింస, కస్టడీ మరణానికి సంబంధించిన కేసు. ఈ కేసులో పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. పిటిషనర్ విజయలక్ష్మీ (సాయికృష్ణ తల్లి) హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఒరిజినల్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను తొలగించి వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్క్‌లను ఉంచినట్లు స్పష్టమవుతోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో హింసించడం, తద్వారా అతడి మరణం, అనంతరం మృతదేహాన్ని మాయడం చేయడానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడం, మాయం చేసే ఉద్దేశంతోనే హార్డ్‌డిస్క్‌ల మార్పిడి జరిగింది.
సాయికృష్ణ జీవించి ఉన్నప్పుడే పరారైనట్లు చిత్రీకరించేందుకు, నేరం జరిగిన గది రూపురేఖలను మార్చడానికి, మృతుడి కుటుంబ సభ్యులను ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. సిట్ దర్యాప్తు పక్షపాతంగా ఉండే అవకాశం ఉండటంతో బాధితుడి కుటుంబంలో, సమాజంలో పలు అనుమానాలు కలుగుతాయి. విరుద్ధ ప్రయోజనాలు ఉన్నందున రాష్ట్ర పోలీసుల చేతుల్లో నిష్పాక్షికమైన విచారణ జరగడం అసాధ్యం. ఈ నేపథ్యంలో సిట్ విశ్వసనీయతను శంకించాల్సి వస్తోంది’ అని ధర్మాసనం తన తీర్పులో ప్రముఖంగా పేర్కొంది.
కస్టడీ మరణాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం కోర్టుల బాధ్యత...
‘తగిన కేసులలో ప్రత్యేకించి పోలీసు కస్టడీలో.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, కస్టడీ హింస, పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సంభవించే కస్టడీ మరణాల వంటి కేసులలో సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం, పరిధి, రాజ్యాంగపరమైన విధి, బాధ్యత ఈ కోర్టుకు ఉంది. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర కూడా విస్మరించలేం. బాధితుడి ప్రయోజనాలతో పాటు దర్యాప్తుపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించడం. చట్టబద్ధమైన పాలనను కాపాడటమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. తద్వారా నిష్పాక్షిక, పక్షపాతరహిత దర్యాప్తు సాధ్యమవుతుంది.
నిష్పాక్షిక విచారణ పొందే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. నిష్పాక్షిక విచారణలో నిష్పాక్షిక దర్యాప్తు కూడా ఒక భాగం. న్యాయస్థానం ఎల్లప్పుడూ సత్యం, న్యాయం కోసం జరిగే అన్వేషణలో భాగస్వామిగా ఉండాలి. న్యాయ వ్యవస్థ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని కాపాడటానికి, ప్రజల్లో విశ్వాసాన్ని నింపడానికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఇది అత్యంత ఆవశ్యకం’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
నిష్పాక్షిక దర్యాప్తు బాధితుల హక్కు...
‘అధికరణ 226 కింద కోర్టుకున్న అధికారం అత్యంత అసాధారణమైనది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ రకమైన అధికారాన్ని ఉపయోగించడంలో గణనీయమైన స్వీయ నియంత్రణ ఉండాలి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అనేది చాలా అరుదుగా, జాగ్రత్తగా, కేవలం అసాధారణ పరిస్థితులలో మాత్రమే జరగాలి. పక్షపాతం లేని, నిష్పాక్షిక దర్యాప్తు పొందే ప్రాథమిక హక్కు బాధితులకు ఉంది. తీవ్రమైన నేరం జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వొచ్చు’ అని హైకోర్టు పేర్కొంది.
చార్జిషీట్ దాఖలు సీబీఐ దర్యాప్తునకు అడ్డంకి కాదు..
‘సిట్ ఇప్పటికే ఏర్పాటైందని, పారదర్శకతతో కూడిన సమగ్ర దర్యాప్తు జరిపిందని, దానిని ప్రశ్నించడానికి లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఛార్జిషీట్ కూడా దాఖలు చేశామని, అందువల్ల సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వాదిస్తున్నారు. అయితే తగిన కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి ఛార్జిషీట్ దాఖలు ఎంత మాత్రం అడ్డంకి కాదు. నిష్పాక్షిక దర్యాప్తుపై ప్రజలకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టడానికి, తద్వారా ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి, చట్టబద్ధమైన పాలనను కాపాడటానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వొచ్చు’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.
పోలీసులపైనే ఆరోపణలున్నాయి.. అందుకే సీబీఐ దర్యాప్తు అనివార్యం...
‘రుబాబుద్దీన్ షేక్ కేసులో ఛార్జిషీట్ సమర్పించినప్పటికీ నేరానికి పాల్పడింది ఏ మూడో వ్యక్తి కాకుండా స్వయంగా పోలీసు సిబ్బందే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. ‘న్యాయం జరగడం మాత్రమే కాక, న్యాయం జరిగినట్లు స్పష్టంగా కనిపించాలి’ అనే సూత్రానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరారోపణలు ప్రభుత్వాధికారులపైనే ఉన్నప్పుడు.. బాధితులతో పాటు ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపడానికి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే సరైన చర్య అవుతుంది. వీటన్నింటి దృష్ట్యా సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం అనివార్యం’ అని జస్టిస్ రవినాథ్ తిల్హరీ ధర్మాసనం పేర్కొంది.
పౌరుల హక్కులను ప్రభుత్వాధికారులు హరిస్తే.. పరిహారం ఇవ్వాల్సిందే
‘రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను ప్రభుత్వాధికారులు హరించినప్పుడు, దానికి పరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని ఆదేశించడమే సరైన, సమర్థవంతమైన పరిష్కారం. కస్టడీ మరణం, కస్టడీ హింస లేదా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన నిరూపితమైన సందర్భాలలో ఈ కోర్టు అధికరణ 226 కింద విచారణ జరిపి పరిహారం మంజూరు చేయవచ్చు. ప్రాథమిక హక్కులు ఖైదీకి కూడా అందుబాటులోనే ఉంటాయి. ఆ హక్కులను ఎవరూ రద్దు చేయలేరు. శిక్ష అనుభవిస్తున్న లేదా విచారణలో ఉన్న ఖైదీ ఎవరైనా సరే జైలులో ఉంచినంత మాత్రాన వారు తమ ప్రాథమిక హక్కులను కోల్పోరు.
పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిని కూడా అతని ప్రాథమిక హక్కుల నుండి వేరు చేయలేరు. అటువంటి వ్యక్తి అసాధారణ మరణానికి గురైతే అతని కుటుంబీకులకు పరిహారం అందించాలి. కస్టడీ హింస లేదా మరణానికి గురైన బాధితుడు ఒక నేరంలో నిందితుడైనంత మాత్రాన అతని కుటుంబానికి పరిహారం నిరాకరించలేరు. ఇటీవల లహ్రా బాయి తామ్రే వర్సెస్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కేసులో కస్టడీ మరణం సంభవించినందున తాత్కాలిక ఉపశమనంగా రూ. 25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే తీర్పును మేం ఇక్కడ కూడా అనుసరిస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘‘రాష్ట్ర పోలీసుల చేతుల్లో నిష్పాక్షికమైన విచారణ జరగడం అసాధ్యం.. సిట్ విశ్వసనీయతను శంకించాల్సి వస్తోంది..’’
‘‘కస్టడీలో జరిగే హింస, వేధింపులు, లాకప్‌లలో సంభవించే మరణాలు చట్టబద్ధమైన పాలనకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. పౌరులను కాపాడవలసిన పోలీసు సిబ్బందే వేటగాళ్లుగా మారి ఇటువంటి చర్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది’’
‘‘కస్టడీ వేధింపులు అనేవి మానవ ఆత్మగౌరవానికి బహిరంగ విఘాతమే కాదు తీవ్రమైన అవమానం కూడా. అది వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. గౌరవానికి భంగం కలిగితే మానవ నాగరికత ఒక అడుగు దిగజారినట్లే (డి.కె. బసు కేసు తీర్పును పునరుద్ఘాటిస్తూ..)’’ – సాయికృష్ణ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
సాయికృష్ణ కేసులో హైకోర్టు తీర్పు బాబు సర్కారుకు చెంపపెట్టు
» సీబీఐ విచారణను స్వాగతించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
» తన ప్రభుత్వ బాధ్యత నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకోలేరు
» డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్రపైనా విచారణ జరగాలి
»బాధ్యులందరికీ శిక్ష పడే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: విజయవాడలో పోలీస్ లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు నాలుగు వారాల్లోగా ఆయన తల్లికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని చంద్రబాబు సర్కారును ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు అని పేర్కొన్నారు. రాజధానిలో పోలీసులు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారని, పోలీసు కస్టడీలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా కనీస పశ్చాత్తాపం కూడా లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని.. డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేం మొదటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయాన్ని గుర్తించాలి. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాల్సిన చంద్రబాబు.. అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి కేసును తొక్కి పెట్టేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో జరిగిన లోపాలకు, ఉన్నతాధికారుల పాత్రను సమగ్రంగా పరిశీలించడంలో విఫలమైనందుకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వైఫల్యాల కారణంగానే ఇవాళ సీబీఐ విచారణ అవసరం ఏర్పడింది. విచారణ ఎదుర్కోవాల్సిన వారిని కాపాడేందుకు ‘సిట్’ ఏర్పాటు ఒక సాకుగా మారకూడదు.
వాస్తవాలు వెలికి తీయాలి..
సాయికృష్ణ కేసులో పూర్తి వాస్తవాలను సీబీఐ వెలికి తీయాలి. ఎవరి బాధ్యత ఏమిటో నిగ్గు తేల్చాలి. ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నవారైనా సరే.. ఈ నేరంలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం జరిగేలా చూడాలి. తన ప్రభుత్వ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. సాయికృష్ణ తల్లికి తన కుమారుడి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆమెకు న్యాయం జరగాలి. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేం అండగా నిలబడతాం.


