తండ్రికి క్లియరెన్స్ వచ్చింది కానీ.. | Sakshi
Sakshi News home page

తండ్రికి క్లియరెన్స్ వచ్చింది కానీ..

Published Sat, Sep 5 2015 8:40 AM

తండ్రికి క్లియరెన్స్ వచ్చింది కానీ..

అహ్మదాబాద్:ఇండియా-పాకిస్థాన్ సంబంధాల నేపథ్యంలో ఇటీవల తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం భజరంగీ భాయ్ జాన్. కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.  పాకిస్థాన్ నుంచి తప్పిపోయి భారత్ కు వచ్చిన ఓ బాలిక కథే భజరంగీ భాయ్ జాన్. కేవలం కల్పిత కథతో రూపుదిద్దుకున్న భజరంగీ భాయ్ జాన్ ను మరిపించే ఘటన తాజాగా భారత్ లో చోటు చేసుకుంది. ఈ రియల్ లైఫ్ కథలోకి వెళితే.. గత సంవత్సరం మార్చినెలలో  కొంతమంది పాకిస్థాన్ జాలర్లు భారత జాలాల్లోకి ప్రవేశించడంతో వారిని మనదేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వారంతా భారత్ లోనే జైలు జీవితం గడుపుతున్నారు. ఇలా పట్టుబడిన వారిలో పాకిస్థాన్ కు చెందిన తండ్రీ కొడుకులు జుమ్మాన్ జేరో- గులామ్ లు ఉన్నారు. భారత-పాకిస్థాన్ ల జాలర్ల విడుదల ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ కు చెందిన 88 మంది జాలర్లను విడుదల చేసేందుకు భారత్ అంగీకరించగా, 163 మంది భారత జాలర్లను విడుదల చేసేందుకు పాకిస్థాన్ ఒప్పుకుంది.

 

అయితే ఇటీవల జైలు నుంచి విడుదలైన తండ్రి జుమ్మాన్ పాకిస్థాన్ కు వెళ్లిపోయినా.. కొడుకు గులామ్ పేరు పాకిస్థాన్ పంపిన జాబితాలో లేకుండా పోయింది. అతని జాతీయతపై పాకిస్థాన్ ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో గులామ్ స్వదేశానికి వెళ్లే మార్గం కష్టతరంగా మారింది. దీనిపై తీవ్ర కలత చెందిన తండ్రి గులామ్ తనను కూడా తిరిగి భారత్ కు వెళ్లేందుకు అనుమతించాలంటూ అభ్యర్థిస్తున్నాడు. మరోపక్క గులామ్ జాతీయతపై ఇప్పటివరకూ తమకు ఎటువంటి నివేదిక అందకపోవడంతో భారత్ అధికారులు డైలమాలో పడ్డారు.

 తండ్రి పేరు జాలర్ల విడుల జాబితాలో ఉన్నా.. కొడుకు పేరు లేకపోవడం నిజంగానే బాధాకరం. మరి అతనికి సాయం చేసేందుకు మరో భజరంగీ భాయ్ జాన్ వస్తారో?లేదో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement