
అటు సరెండర్.. ఇటు రీపోస్టింగ్!
ఉన్నచోటి నుంచి మరో చోటికి బదిలీ కావాలా? బదిలీలపై నిషేధం ఉంది కదా.. ఎలా? చాలా సింపుల్.. ముందుగా ఉన్నతాధికారికి సరెండర్ చేయడం..
బదిలీల కోసం వైద్యారోగ్య శాఖలో ముడుపుల దందా
► సదరు ఉద్యోగులు తప్పు చేశారంటూ డైరెక్టరేట్‌కు సరెండర్
► వారం తిరిగేసరికల్లా కోరుకున్న చోటికి పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: ఉన్నచోటి నుంచి మరో చోటికి బదిలీ కావాలా? బదిలీలపై నిషేధం ఉంది కదా.. ఎలా? చాలా సింపుల్.. ముందుగా ఉన్నతాధికారికి సరెండర్ చేయడం.. ఆ తర్వాత పోస్టింగ్ పేరిట మరోచోటికి పంప డం.. అంతే! వైద్యారోగ్య శాఖలో అడ్డగోలుగా జరుగుతున్న సరికొత్త బదిలీల దందా ఇది. నిషేధాన్ని అతిక్రమించేందుకు ఆ శాఖ అధికా రులు వేస్తున్న సరికొత్త ఎత్తుగడ ఇది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పబ్లిక్ హెల్త్ పరిధిలో..
గత నెల రోజుల్లోనే వైద్యారోగ్య శాఖలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇన్ని బదిలీలు ఎలా జరిగాయని ఆరా తీస్తే.. తెరవెనక బాగో తం బయటపడింది. ఉద్యోగులను ఏదో ఒక కారణం చూపించి సరెండర్ చేయడం.. వారం తిరక్కముందే వాళ్లు కోరుకున్న చోటికి బదిలీ చేయటం జరిగిపోతోంది. సూర్యాపేట జిల్లా కాపుగల్లు పీహెచ్‌సీలో పని చేసిన ఒక ఎంపీహెచ్‌ఈవో ఇటీవల సరెండర్‌పై డైరెక్టరేట్‌కు చేరి.. అక్కణ్నుంచి వారం వ్యవధిలోనే సరూర్‌నగర్‌కు పోస్టింగ్‌కు తెచ్చుకున్నారు.
అంతకు ముందు సరూర్‌నగర్‌లోనే డిప్యుటేషన్‌పై పని చేసిన ఆయన.. డిప్యుటేషన్ రద్దయ్యాక వారంలోనే సరెండరైన తీరు బదిలీల బాగో తాన్ని కళ్లకు కడుతోంది. ఇక సూర్యాపేట జిల్లా మోతె పీహెచ్‌సీ నుంచి ఒక స్టాఫ్ నర్సు జిల్లా కేంద్రానికి మరింత దగ్గరగా చివ్వెంల పీహెచ్‌సీకి పోస్టింగ్ సాధించుకున్నారు. పూర్వపు రంగారెడ్డి జిల్లా నుంచి పనిచేసిన ఒక హెల్త్ ఎడ్యుకేటర్ ఇదే తరహాలో ఏకంగా హైదరాబాద్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే తిష్ట వేశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక సీనియర్ అసిస్టెంట్ అయితే జోన్లకు అతీతంగా హైదరాబాద్ డైరెక్టరేట్‌కు బదిలీ చేయించుకున్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత రంగారెడ్డి జిల్లా నార్సింగి పీహెచ్‌సీకి బదిలీ చేయించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని కొండమడుగు పీహెచ్‌సీకు చెందిన మల్టీపర్పస్ హెల్త్ సూపర్‌వైజర్ యాదాద్రి జిల్లాలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర పీహెచ్‌సీలో పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీ సర్ నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్నారు. ఇలా నెలలోనే ఇరవైకి పైగా బదిలీలు జరిగాయి. మరికొందరు ఉద్యోగులు సరెండర్ చేయించుకుని.. కోరుకున్న చోట రీపోస్టింగ్ పొందేందుకు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
సరెండర్ వెనుక హైడ్రామా...
సాధారణంగా ఉద్యోగి తప్పు చేస్తే లేదా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ముందుగా మెమో జారీ చేయాలి, రాతపూర్వక వివరణ కోరాలి. తప్పిదాలు వరుసగా జరిగినా, వరుసగా మెమోలు జారీ అయినా.. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పు తీవ్రత ఎక్కువగా ఉంటే, వివరణకు సంతృప్తి చెందకుంటే ఆ జిల్లా వైద్యారోగ్యాధికారి ఆ ఉద్యోగిని డైరెక్టరేట్‌కు సరెండర్ చేస్తారు. ఆ ఉద్యోగి ఇంక్రిమెంట్లలో కోత, కొంతకాలం పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం చేస్తారు.
డైరెక్టరేట్ కేంద్రంగానే దందా!
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషే ధం ఉంది. కానీ డబ్బులు ముట్టజెపితే కోరుకున్న చోటికి బదిలీ చేయిస్తామంటూ కొందరు దళారులు డైరెక్టర్ కార్యాలయం కేంద్రంగా దందాకు తెరలేపారు.