రీయింబర్స్‌మెంట్‌ ‘ఫీ’వర్‌ | Sakshi
Sakshi News home page

రీయింబర్స్‌మెంట్‌ ‘ఫీ’వర్‌

Published Thu, Jul 19 2018 1:46 AM

Telangana Students Facing Fee Reimbursement Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిధులు సకాలంలో విడుదలవక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కోర్సు పూర్తయినా ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. దీంతో అర్హత ఉన్నా సర్టిఫికెట్లు లేక తదుపరి కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. మరికొందరు ఉద్యోగాలకు అర్హత సాధించినా ఒరిజినల్స్‌ లేక చేరలేకపోతున్నారు. పోస్టుమెట్రిక్‌ కోర్సులకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరం ఫీజులు, ఉపకారవేతనాలు ఇప్పటికీ విడుదల కాలేదు. బడ్జెట్‌ సర్దుబాటులో భాగంగా సంక్షేమ శాఖలు కొంతమేర నిధులు మంజూరు చేసినా ఖజానా శాఖ ఆంక్షల వల్ల పంపిణీ నిలిచిపోయింది.  

రూ. 2 వేల కోట్ల బకాయిలు!
ప్రస్తుతం 2017–18కు సంబంధించి దరఖాస్తుల పరిశీలన సాగుతోంది. ఇప్పటివరకు పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి రూ. 1,758.51 కోట్లు చెల్లించాల్సి ఉంది. పరిశీలన పూర్తయితే మరో మరో రూ. 5 వందల కోట్లు అవసరమవుతాయి. 2016–17కు సంబంధించి రూ.452 కోట్ల బకాయిలున్నాయి. దీంతో బకాయిలు రూ. 2 వేల కోట్లకు బకాయిలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంక్షేమ శాఖల వద్ద అందుబాటులో ఉన్న రూ. 200 కోట్లు చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాధాన్య క్రమంలో నిధులు విడుదల చేస్తున్నారు. తొలుత కోర్సు ముగిసిన వారికి ఇచ్చేందుకుగాను బిల్లులు తయారు చేసి ఖజానా శాఖకు పంపిస్తున్నారు. కానీ సంక్షేమ శాఖలు విడుదల చేసిన నిధులు ఖాతాల్లో జమ కాకపోవడం గమనార్హం.

టోకెన్స్‌ మాత్రమే..  
ఉపకారవేతనాలు, రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను తయారు చేసి ఖజానా శాఖకు సంక్షేమ శాఖలు పంపిస్తాయి. ఆన్‌లైన్‌లో టోకెన్స్‌ జనరేట్‌ చేస్తున్న ఖజానా శాఖ అధికారులు.. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఆ శాఖపై ఆంక్షల నేపథ్యంలో వాటి విడుదలకు బ్రేక్‌ పడుతోంది. ఆర్థిక శాఖ ఆంక్షలు ఎత్తేసినపుడు సీలింగ్‌ మేరకు నిధులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానా శాఖ వద్ద రూ.211 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి.  

ధ్రువపత్రాలు ఉంటేనే
ప్రభుత్వ ఉద్యోగానికే కాదు.. ప్రైవేటు ఉద్యోగాలకూ ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తప్పనిసరి అయింది. ఎంఎస్‌డబ్ల్యూ కోర్సుకు భారీ డిమాండ్‌ ఉండటంతో ఆ కోర్సు చేశా. కానీ ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం నా సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఈ–పాస్‌లో రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ స్టేటస్‌ ట్రెజరీలో పెండింగ్‌ ఉన్నట్లు చూపిస్తోందని, అది క్లియర్‌ అయితేనే సర్టిఫికెట్లు అందుతాయని చెబుతోంది. – ముస్తఫా, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా

కొందరికే విడుదల  
మర్పల్లిలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివా. 85 శాతంమార్కులతో పాసయ్యా. డిగ్రీలో చేరాలంటేఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. కానీ ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. నా స్నేహితుల్లో కొందరికే ఫీజు, ఉపకారవేతనాలు విడుదలయ్యాయి. మరికొందరికి ఇప్పటికీ అందలేదు. డిగ్రీలో ఎలా చేరాలో పాలుపోవడం లేదు. – కేతావత్‌ నరేశ్, మర్పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా

బకాయిలన్నీ చెల్లించాలి
విద్యార్థుల సంఖ్యకు తగినన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు. దీంతో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర కీలకంగా ఉంది. మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వమిచ్చే ఫీజులపై ఆధారపడి చదువుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌ నిధులు సకాలంలో విడుదల చేస్తే విద్యాసంస్థలు సక్రమంగా నిర్వహించుకునే వీలుంటుంది. నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో కాలేజీ నిర్వహణ కూడా గందరగోళమవుతోంది. విద్యార్థులను అడగలేక, ప్రభుత్వం నుంచి అందక యాజమాన్యాలు అప్పులపాలవుతున్నాయి. రెండేళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. – గౌరి సతీశ్, కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్‌.

Advertisement
Advertisement