ఎంతో పని.. ఎన్నొబాధ్యతలు | Sakshi
Sakshi News home page

ఎంతో పని.. ఎన్నొబాధ్యతలు

Published Tue, Nov 13 2018 10:39 AM

Election Duty Presiding Officers - Sakshi

సాక్షి, అచ్చంపేట / కల్వకుర్తి టౌన్‌ : మనది ప్రజాస్వామ్య దేశం. ఓటరు తన ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకొని పీఠం ఎక్కించగలిగే సత్తా ఉంది. ఈ అధికారాన్ని ఓటర్లకు రాజ్యాంగం కల్పించింది. అలాంటి విలువైన ఓటును వేయాలంటే దాని వెనుక ఎంతో మంది అధికారుల కృషి ఉంటుంది. గ్రామస్థాయిలో బూత్‌లెవల్‌ అధికారి నుంచి జిల్లా ఎన్నికల అధికారి వరకు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవుతాయి.

   అధికారుల్లో సమన్వయం లోపిస్తే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల దాఖలు నుంచి పోలింగ్,ఎన్నికల నియమావళి అమలు, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువరించే వరకు అధికారులు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది. మరి ఏ అధికారికి ఏయే బాధ్యతలు, అధికారాలు ఉంటాయో తెలుసుకుందామా?! 


జిల్లా ఎన్నికల అధికారి 
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లాలో జిల్లా కలెక్టర్‌ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవరిస్తారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లును పర్యవేక్షించడం, నామినేషన్ల ప్రక్రియ, ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియమించడం, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటిప్పుడు అప్రమత్తంగా ఉంచడం తదితర కార్యక్రమాల్లో జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి పాత్ర ఎంతో ఉంటుంది.   

సెక్టోరియల్‌ అధికారి 
8 నుంచి10 పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించే అధికారాలు వీరికి ఉంటాయి. ఓటర్ల నమోదు జాబితాను తయారు చేయడం ఈ అధికారి ప్రధాన కర్తవ్యం. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నవారు ఈ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. 
 

ప్రధాన ఎన్నికల అధికారి 

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈఅధికారిని నియమిస్తుంది. ఆ అధికారి సంబంధిత నియోజకవర్గ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. నామినేషన్‌ ప్రక్రియ, తుది జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లండి వంటి అన్ని అంశాలు ఈ అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి. 


 బూత్‌ లెవల్‌ అధికారి 
కొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం–6, తొలగింపునకు ఫారం–7, తప్పుల సవరణకు అవసరమైన పారాలు ఇవ్వడం, అర్హుల ఓటు నమోదు చేసుకునేలా చూడటం, ఓటరు జాబితాలు ప్రదర్శన, పోలింగ్‌ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాద్యత. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను ప్రతిపాదించడం చేస్తారు. వీఆర్‌ఓలు, కారోబార్లు, అంగన్‌వాడీ టీచర్లు బూత్‌లెవల్‌ అధికారులుగా వ్యవరిస్తారు. 


ప్రిసైడింగ్‌ అధికారి 
సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి ప్రిసైడింగ్‌ అధికారిదే పూర్తి బాద్యత. ఎన్నికలకు అవరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్‌ కేంద్రానికి తీసుకువచ్చి, ఎన్నికల ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చే వరకు ఈ అధికారి బాద్యత వహిస్తారు. వీరికి సహాయంగా సహాయ ప్రిసైడింగ్‌ అదికారులు ఉంటారు. పోలింగ్‌ స్టేషన్‌లో జరిగే అన్ని కార్యకలాపాలు వీరి పర్యవేక్షణలో జరుగుతాయి.


సూక్ష్మ పరిశీలకులు 
ఎన్నికల నిర్వహణ జరిగిన తీరు, సంబంధిత పర్యవేక్షణపై నివేదికను రూపొందించి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపిస్తారు. 

దివ్యాంగులకు ఫెసిలిటేటర్లు.. 
ఈసారి దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనువుగా పోలింగ్‌ బూత్‌ల వద్ద ట్రైసెకిళ్లతో పాటు ఫెసిలిటేర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫెసిలేటర్లుగా ఆశ వర్కర్లు, విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు వ్యవహరిస్తారు.  

Advertisement
Advertisement