చంద్రబాబు ప్రచారమే చేటు తెచ్చింది! | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రచారమే చేటు తెచ్చింది!

Published Thu, Dec 13 2018 9:45 AM

Congress Leaders Worried on Chandrababu Campaign - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: చంద్రబాబు ప్రచారం వల్లే హైదరాబాద్‌ మహా నగరంలో టీడీపీతోపాటు ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీజేఎస్‌లకు సైతం ప్రజలు ఓట్లేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లోనూ కూటమి పొత్తు వల్లే  ఆ పార్టీ దెబ్బతిన్నదని వివిధ కార్యాలయాల్లోని ఉద్యోగుల మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ ఒంటరిగానే పోటీ చేసి ఉంటే నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగానూ దానికి  40 కంటే ఎక్కువ సీట్లే వచ్చి ఉండేవని చర్చించుకుంటున్నారు. కూటమిగా ఏర్పడి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్‌ మద్దతుదారులు సైతం టీఆర్‌ఎస్‌కు ఓట్లేశారనే చర్చలు జరుగుతున్నాయి. టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు వల్లే టీఆర్‌ఎస్‌ ఓడిపోయే నియోజకవర్గాల్లోనూ ఆ ఆపార్టీ అభ్యర్థులు తిరిగి గెలిచారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనుకున్నప్పటికీ ఇంత ఏకపక్షంగా ఫలితాలొస్తాయని, ఇంత ప్రభంజనం వీస్తుందనుకోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

అసమ్మతులున్నా.. ఆగని టీఆర్‌ఎస్‌ విజయం..
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు రావడం తెలిసిందే. సిట్టింగ్‌లు లేని ప్రాంతాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వారికీ టిక్కెట్లు లభించాయి.  ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయి, ఇప్పుడు టిక్కెట్లు రాని వారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి మనస్పూర్తిగా పని చేయకపోయినప్పటికీ వారు గెలిచారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసిన కార్పొరేటర్లు, కార్పొరేటర్ల కుటుంబీలకు నిరాశే ఎదురైంది. అలాంటి వారిలో కొందరు రెబెల్స్‌గానూ నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు, నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లకు పొసగని పరిస్థితి. అలాంటి చోట కార్పొరేటర్లే పార్టీ అభ్యర్థిని ఓడిస్తారనే ప్రచారమూ జరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో టీఆర్‌ఎస్‌కు ఇన్ని సీట్లు రావడానికి చంద్రబాబే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఓట్లేద్దామనుకున్న వారు సైతం చంద్రబాబుతో పొత్తు చూసి.. తమ అభిప్రాయాన్ని మార్చుకొని టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపారని భావిస్తున్నారు. ఇందువల్లే కూటమిలోని పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు.

నగరంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు సైతం చంద్రబాబు పార్టీకి, ఆయన పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలకు ఓట్లేయలేదని మరికొందరు పేర్కొన్నారు. తెలంగాణలో పోలింగ్‌ను పురస్కరించుకొని ఏపీలో సెలవివ్వడంతో నగరానికి వచ్చిన వారు కూటమికి కాకుండా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేశారని చందానగర్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇక కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగకపోవడం, కూటమి పార్టీలోని అభ్యర్థులకు ఎవరికి ఏ నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ వస్తుందో చివరిదాకా తెలియకపోవడం వంటివి కూడా కూటమి పార్టీలు దెబ్బతినడానికి మరో కారణమనే వ్యాఖ్యానాలూ వినిపించాయి. కొన్ని స్థానాల్లో మాత్రం తమ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచిన చంద్రబాబు ఇక్కడికొచ్చి చేసేదేమీ ఉండదనే అభిప్రాయంతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రులెవరవుతారో తెలియదని, ప్రతి పనికీ ఢిల్లీకి, అమరావతి వెళ్లాల్సి వస్తుందని టీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం కూడా ఆ పార్టీకి బాగా ఉపకరించిందని, ముఖ్యంగా జిల్లాల్లో అది బాగా పనిచేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సీమాంధ్రకు చెందిన వివిధ వర్గాల వారు ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరైన కేటీఆర్‌ ఇచ్చిన హామీలు తదితర వాటితోనూ కూడా కూటమి పార్టీలకు పడాల్సిన ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడ్డాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి తదితర నియోజకవర్గాల్లో తిరిగి టీఆర్‌ఎస్‌ గెలిచేందుకు ఆయా సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement