టీడీపీ ఉలికిపాటు! | Sakshi
Sakshi News home page

టీడీపీ ఉలికిపాటు!

Published Sat, May 12 2018 4:58 AM

CM chandrababu and Ministers condemned the attack on Amit Shah convoy - Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనను కప్పి పుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తిరుపతి టీడీపీ నాయకులు ఈ దాడికి పాల్పడడాన్ని ప్రసార మాధ్యమాల్లో అందరూ చూసినా దాంతో తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకునేందుకు ఆ పార్టీ మంత్రులు, నాయకులు నానా అవస్థలు పడుతున్నారు.

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీని గురించి ప్రస్తావించి ఇలాంటి ఘటన జరక్కూడదని, అది ఎవరు చేసినా తప్పేనన్నారు. ఘటనను ఖండించి బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఈ గొడవ ఎటు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, ఈ ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందు అమిత్‌ షాకు రాష్ట్రంలో తిరిగే హక్కులేదని సాక్షాత్తూ పలువురు మంత్రులు సమావేశం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 

సీఎం, మంత్రుల్లో అలజడి
అమితషా కాన్వాయ్‌పై దాడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో టీడీపీ శిబిరంలో అలజడి మొదలైంది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే.. దీనిపై ఏం చేయాలి, ఎలా స్పందించాలనే దానిపై మంత్రులు హడావుడి పడ్డారు. మరోవైపు.. కంగారులో మంత్రులు, నాయకులు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేశారు. హోంశాఖ మంత్రి చినరాజప్ప అధికారికంగా దీనిపై వివరణ ఇస్తూ.. అమిత్‌ షాపై అసలు దాడి జరగలేదని చెప్పడం విశేషం. టీడీపీ ముసుగులో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తంచేశారు.

కొద్దిసేపటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. ఇది దురదృష్టకరమని, అమిత్‌ షాపై గౌరవం ఉందన్నారు. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు జిల్లా నాయకులు మాట్లాడుతూ.. అసలు రాళ్ల దాడే జరగలేదని, ఒక జెండా కర్ర వాళ్ల కారుకి తగిలిందని చెప్పుకొచ్చారు. రాళ్ల దాడి జరిగినట్లు చినరాజప్ప చెప్పారు కదా అని విలేకరులు ప్రశ్నిస్తే.. తాము వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతున్నామంటూ, ఉపముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పినట్లు వివరించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రాళ్లు పడ్డాయని చినరాజప్ప చెప్పి తమ కొంపముంచారని ఇతర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు వాపోవడం గమనార్హం.   

Advertisement

తప్పక చదవండి

Advertisement