కమలోత్సాహం! | Sakshi
Sakshi News home page

కమలోత్సాహం!

Published Wed, Apr 10 2019 8:08 AM

BJP Party Leaders Happy With Samshabad Meeting Success - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కమలదళంలో నూతనోత్సాహం వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఆ పార్టీ శ్రేణుల్లో.. కమల దళపతి అమిత్‌ షా ఉత్సాహం నింపారు. విజయ సంకల్ప సభ పేరిట శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ గ్రౌండ్స్‌లో మంగళవారం బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విశేష స్పందన రావడంతో... చేవెళ్ల లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బెక్కరి జనార్దన్‌ రెడ్డి గెలుపుపై పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఆయనకు మద్దతుగా జిల్లాకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభావేదికపై నుంచి ప్రసంగించారు.

ఒకవైపు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే.. మరోపక్క శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. తన ప్రసంగంలో కార్యకర్తల నుంచే అమిత్‌ షా సమాధానాలు రాబట్టారు. నాయకులు, కార్యకర్తలంతా ముక్తకంఠంతో బదులివ్వడంతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం.. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో పద్మనాభస్వామి దేవుడి ప్రస్తావనతో మొదలుకావడం విశేషం. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ లోటుపాట్లు, దేశ భద్రత అంశంపై వ్యవహరిస్తున్న తీరును సవివరంగా ఎండగడుతూనే.. తమ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ఏం చేసిందో చెప్పారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల లెక్కను ప్రజల ముందుంచారు. జనార్దన్‌రెడ్డి విజయాన్ని ప్రధాని మోదీకి బహుమానంగా ఇవ్వాలని ఈ సందర్భంగా అమిత్‌షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆయన మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.  

రంజిత్‌కు జిల్లా పరిధే తెలియదు..
జిల్లా పరిధి ఎంత వరకు ఉందో తెలియని వ్యక్తి ఎన్నికల బరిలో నిలిచారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌ రెడ్డిని ఉద్దేశించి జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు ధనబలం తప్ప.. జనబలం లేదని విమర్శించారు. తనకు జనబలంతో పాటు బీజేపీ అండగా ఉందన్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో హైటెక్‌ సిటీ ఉండటంతో.. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమన్న భావన అందరిలో ఉందన్నారు. కానీ ఇది తప్పని చెప్పారు. లోటెక్‌ సిటీలూ,  మారుమూల పల్లెలు, బస్తీలు కూడా ఇక్కడ విస్తరించి ఉన్నాయన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే చేవెళ్లను ఆదర్శ లోక్‌సభ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా పేరును అనంతగిరిగా మార్చడంతోపాటు ఇక్కడి ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

ఎంపీగా గెలిస్తే ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎండిపోయిన మూసీ నదిలో వేసినట్లేనని తనదైన శైలిలో విమర్శించారు. నాలుగున్నరేళ్లు అధికార పార్టీ నుంచి ఎంపీగా కొనసాగిన వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారని, ఆయన ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో 16 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. అవే స్థానాలను బీజీపీ ఖాతాలో పడితే దేశం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలు, ఓటర్లకు ఆశచూపడం తçప్ప ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ఏం చేయలేదని మహబూబ్‌నగర్‌ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర నుంచి నిధులు రాకుండా ఉంటే.. రాష్ట్రంలో ఏ పథకం కూడా కొనసాగేది కాదన్నారు.  దీనిని గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకే ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ లక్ష్మణ్,  రాపోలు ఆనంద భాస్కర్,   నల్లు ఇంద్రసేనారెడ్డి, గజ్జెల యోగానంద్, అందెల శ్రీరాములు యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement