అంతా ‘ఆయన’ ఇష్టమేనా... ఇంకెన్నాళ్లు?

Sex with minor wife is rape, says supreme court - Sakshi

పద్దెనిమిదేళ్లు నిండితేనే... ‘సమ్మతి’ చెప్పే మానసిక పరిపక్వత వస్తుంది. దాని పర్యవసానాలేమిటో అర్థం చేసుకోగలరు. ఇతర చట్టాలు కూడా (జువైనల్‌ జస్టిస్‌ చట్టం–2000, బాల్యవివాహ నిషేధ చట్టం –2006, పోస్కో చట్టం–2012) 18 ఏళ్లు నిండని అమ్మాయిలను బాలికలుగానే పరిగణిస్తున్నాయి. కాబట్టి 15–18 ఏళ్ల వయసులో ఉన్న భార్యతో సంభోగం కూడా నేరంగానే పరిగణించాలి. వీరితో శారీరకంగా కలవడం నేరం కాదని భారత శిక్ష్మాస్మృతిలోని 375 ఆర్టికల్‌ 2 కింద ఇస్తున్న మినహాయింపును రద్దు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలకతీర్పు వెలువరించింది. దీంతో ‘మారిటల్‌ రేప్‌’ను కూడా నేరంగా పరిగణించాలనే దీర్ఘకాలిక డిమాండ్‌ మళ్లీ చర్చనీయాంశం కానుంది. ఈ నేపథ్యంలో మారిటల్‌ రేప్‌పై భారత్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయి. అంతర్జాతీయం పరిస్థితి(సాక్షి) ఏమిటనేది చూద్దాం...

మారిటల్‌ రేప్‌
స్త్రీ సమ్మతి లేకుండా ఎవరు బలప్రయోగం ద్వారా ఆమెను లొంగదీసుకున్నా, బలాత్కారం చేసినా అది రేప్‌ కిందకే వస్తుంది. నేరం చేసినట్లే. భార్యాభర్తలు అయినప్పటికి అర్ధాంగికి ఇష్టం లేకుండా ఆమెతో బలవంతంగా సంభోగం జరిపితే దాన్ని ‘మారిటల్‌ రేప్‌’గా పేర్కొంటారు. చాలా పాశ్చాత్యదేశాల్లో దీన్ని రేప్‌గానే పరిగణిస్తారు. శిక్షార్హమైన నేరం.

భారత్‌లో మినహాయింపు
పదిహేనేళ్ల వయసు పైబడిన సొంత భార్యతో ఆమె సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొన్నా అది నేరం కాదు... భారత శిక్ష్మాస్మృతిలోని ఆర్టికల్‌ 375లో మినహాయింపునిచ్చారు. సుప్రీంకోర్టు బుధవారం దీన్ని సవరించి... 18 లోపు భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరమని తేల్చింది. ‘చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యను బలవంతంగా అనుభవిస్తే భర్తను దోషి అనడానికి లేదు. ఎందుకంటే పెళ్లికి అంగీకరించడం ద్వారా ఆమె తనకు తాను భర్తకు సమర్పించుకుంది. దీని నుంచి ఆమె వెనక్కి మళ్లడానికి వీల్లేదు’ అని చీఫ్‌ జస్టిస్‌ సర్‌ మాథ్యూ హేల్‌ 1736లో ప్రచురితమైన తన పుస్తకంలో రాశారు. ఆయన అభిప్రాయం బ్రిటన్‌లో చట్టమైంది. ఆంగ్లేయుల పాలనలో ఉన్న చాలాదేశాల్లానే(సాక్షి) మనం కూడా బ్రిటిష్‌ వారి ‘కామన్‌ లా’ నుంచి దీన్ని స్వీకరించాం.

మహిళల వాదన
 భార్య వద్దంటున్నా, ఆమె శారీరక, మానసిక పరిస్థితి బాగాలేకున్నా భర్త బలవంతంగా కోరిక తీర్చుకోవడాన్ని ‘రేప్‌’గానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆమె సమ్మతి లేదు. భార్యపై భర్తకు సర్వహక్కులుంటాయనేది పితృస్వామ్య ఆధిపత్య ధోరణి భావజాలం. ఆడది వస్తువు కాదు. ఆమెకూ మనోభావాలుంటాయి. భర్త పిలవగానే పక్క మీదకు రావాల్సిందేనా? ఆమె ఇష్టానిష్టాలతో, ఆసక్తితో సంబంధం లేదా? దాంపత్య బంధంలో అంతా భర్త ఇష్టమేనా? స్త్రీల పట్ల వివక్ష చూపుతోంది చట్టం. ఏ శారీరక సంబంధానికైనా పరస్పర సమ్మతి అనేది మాతృక. పెళ్లయిన జంటలకూ  ఇదే వర్తిస్తుంది. వివాహిత అయినంత మాత్రాన స్త్రీకి తన శరీరంపై హక్కు ఉండదా? అవివాహిత స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవిస్తే(సాక్షి) అది నేరం అవుతుంది. రేప్‌ కిందకు వస్తుంది. వివాహిత స్త్రీ విషయంలో మాత్రం ఆమె భర్తకు మినహాయింపు ఉంటుందా? ఆమె సమ్మతితో పనిలేదా? అంటే వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య వివక్ష చూపుతున్నట్లేగా? అందరికీ సమాన రక్షణ కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌–14కు మారిటల్‌ రేప్‌ మినహాయింపు విరుద్ధం.

అలాగే లింగపరంగా ఎలాంటి బేధం చూపకూడదనే ఆర్టికల్‌–15ను, గౌరవంగా బతికే హక్కును కల్పిస్తున్న ఆర్టికల్‌–21ను కూడా ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోంది. పైగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. ఏకాంతాన్ని కోరుకోవడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడం (ఆర్టికల్‌–21) కిందకు వస్తుంది. కాబట్టి భర్త బలవంతంగా సంభోగం చేస్తే... బాధిత మహిళకు ఆర్టికల్‌– 21 కల్పించిన హక్కులను కూడా ఉల్లఘించినట్లే. భారతీయ మహిళల్లో మారిటల్‌ రేప్‌ బాధితులు చాలా ఎక్కువ. సాంఘిక కట్టుబాట్ల మూలంగా వీరు మౌనంగా దీన్ని భరిస్తున్నారు. వీరికి రక్షణ కల్పించాలంటే మినహాయింపును ఎత్తివేయాల్సిందే.
– మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తల వాదన

మినహాయింపు తీసేయండి
‘‘పెళ్లయితే భార్యపై భర్తకు సర్వహక్కులు దఖలు పడతాయనే, ఆమె అతని ఆస్తి అవుతుందనే కాలం చెల్లిన భావజాలం నుంచి పుట్టుకొచ్చిందే ఈ మారిటల్‌ రేప్‌ మినహాయింపు. రేప్‌ లేదా లైంగిక దాడి జరిగినపుడు... వారిద్దరు భార్యాభర్తలని లేదా చాలాకాలంగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉందని చెప్పి నిందితుడు సమర్థించుకోజాలడు. లైంగిక దాడి భావోద్రేక చర్య కాదు... అవతలి వ్యక్తిపై బలప్రదర్శన. లొంగి ఉండాలని చెప్పడం. ఫిర్యాదుదారు, నిందితుడి మధ్య సంబంధం ఏమిటనేది అప్రస్తుతం. సంభోగానికి ఆమె సమ్మతి ఉందా? లేదా? అనేదే ముఖ్యం. కాబట్టి మారిటల్‌ రేప్‌కు మినహాయింపును ఎత్తివేయాలి’’
– 2012లో నిర్భయ ఉదంతం అనంతరం క్రిమినల్‌ చట్టాలను సమీక్షించేందుకు నియమించిన జస్టిస్‌ జే.ఎస్‌.వర్మ త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసు. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించలేదు.

మన దగ్గర సాధ్యం కాదు...
భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, మతవిశ్వాసాలకు నెలవైన భారత్‌ లాంటి దేశంలో భర్త జరిపే లైంగిక దాడిని నేరంగా చేయడం సాధ్యం కాదు. మహిళల్లో ఆర్థిక స్వావలంభన తక్కువ. అక్షరాస్యత, పేదరికం తదితర సాంఘిక అసమానతలను కూడా దృష్టిలో పెట్టుకొని చూసినపుడు భారత్‌లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లిని పవిత్ర బంధంగా చూస్తాం. ఒక వివాహిత మహిళ భర్త తనను బలాత్కారం చేశాడని చెప్పొచ్చు. ఇతరులకు అది బలాత్కారం అనిపించకపోవచ్చు. దీన్ని నేరంగా చేయాలనే అంశాన్ని పరిశీలించే ముందు అసలు ‘మారిటల్‌ రేప్‌’ అంటే ఏమిటనేది విస్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తే... భారత్‌లో వివాహ వ్యవస్థ(సాక్షి) విచ్ఛన్నతకు దారి తీస్తుంది. మారిటల్‌ రేప్‌ను నేరం చేస్తే... 489ఏ (గృహ హింస నిరోధక చట్టం) లాగే ఇది కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉంటాయి. భర్తలను వేధించడానికి భార్యలు దీన్నో సాధనంగా వాడే ఆస్కారం ఉంటుంది.
– ఆగష్టులో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం.

(యూపీఎ, ఎన్డీయే... ఏ కూటమి అధికారంలో ఉన్నా... మారిటల్‌ రేప్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాయి. పార్లమెంటులో కూడా మారిటల్‌ రేప్‌ను నేరం చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం చట్టాన్ని మార్చే అధికారం పార్లమెంటుదేనని, దీనిపై పాలకుల దృష్టి పెట్టాలని అంటోంది.)

చాలా దేశాల్లో నేరం...
ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి... 15 దేశాల్లో మారిటల్‌ రేప్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్‌. 1932లో పోలండ్‌ ఈమేరకు చట్టం చేసింది అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంటు చేసిన తీర్మానం... మారిటల్‌ రేప్‌ను నేరంగా చేయాలని(సాక్షి) పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్‌ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్‌ 2002లోనే మారిటల్‌ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంలో నేపాల్‌ ప్రభుత్వం చట్టాలను మార్చింది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top