సోగ్గాడు బిజీ బిజీ | Nagarjuna's Soggade Chinni Nayana | Sakshi
Sakshi News home page

సోగ్గాడు బిజీ బిజీ

Feb 4 2015 11:49 PM | Updated on Jul 21 2019 4:48 PM

సోగ్గాడు బిజీ బిజీ - Sakshi

సోగ్గాడు బిజీ బిజీ

హీరో నాగార్జున పేరు చెబితే, ఇప్పుడు అందరికీ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమం గుర్తొస్తోంది....

హీరో నాగార్జున పేరు చెబితే, ఇప్పుడు అందరికీ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమం గుర్తొస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే అందరినీ ఆయనకు అభిమానుల్ని చేసిన టీవీ షో అది. ఒకపక్క ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న నాగార్జున కొద్దికాలం విరామం తరువాత ఇప్పుడు సినిమా షూటింగ్‌లోనూ బిజీగా పాల్గొంటున్నారు. అందరినీ ఆకట్టుకున్న నిరుటి ‘మనం’ తరువాత ఇప్పుడు ఆయన ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరు ప్రచారంలో ఉంది.

ప్రతిభావంతులైన కొత్తవాళ్ళను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున అదే పద్ధతి కొనసాగిస్తూ, ఈ చిత్రంతో కల్యాణ్‌కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పరిసరాల్లో దాదాపు 20 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. వచ్చేవారం నుంచి దాదాపు నెల నుంచి నెలన్నర దాకా హైదరాబాద్ పరిసరాల్లోనే తదుపరి షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఈ ప్రధానమైన షెడ్యూల్‌లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారని సమాచారం.

ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. బ్రహ్మానందం, ఝాన్సీ, హంసానందిని తదితరులు ఇతర తారాగణం. గత ఏడాది కాలంగా మంచి జోరు మీదున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అన్నట్లు, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇతర రాష్ట్రాలలో చిత్రీకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట! అందుకోసం తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కూడా లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఒకప్పటి అక్కినేని హిట్ గీతం పల్లవిలోని మాటలనే పేరుగా పెట్టుకొన్న ఈ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వివరాలు అధికారికంగా త్వరలో తెలుస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement