ఈ పాటలోని నవ్వులు నావే.. | Sakshi
Sakshi News home page

ఈ పాటలోని నవ్వులు నావే..

Published Sun, Mar 1 2020 10:37 AM

Manasaina Chinnadana Song History - Sakshi

రమోలా గాయని, డబ్బింగ్‌ కళాకారిణి: దత్తపుత్రుడు చిత్రం కోసం నేను ఘంటసాల గారితో పాడిన ‘మనసైన ఓ చిన్నదానా ఒకమాటుంది వింటావా/సిగ్గు పడే ఓహో చిలకమ్మా కంది చేనుంది పోదామా’ పాట బాగా ఇష్టం. ఈ పాటలో చిన్న చిన్న డైలాగులు, వాణిశ్రీ నవ్వులు మాత్రమే నా గొంతులో వినిపిస్తాయి. ఈ పాట బాగా పాపులర్‌ అయ్యింది. ‘ఎట్టాగెట్టాగెట్లా ఎట్లెట్లా/ హహహహహహ’ అంటూ నవ్వుతాను. నా నవ్వుని అందరూ ఇష్టపడేవారు. ఘంటసాలగారితో ఇలాంటి డ్యూయెట్లు చాలా పాడాను. ఆయనకు నేను ముద్దుల చెల్లెమ్మను. ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మగారు ఇప్పటికీ నన్ను ఎంతో అభిమానంగా పలకరిస్తారు. 
నేను పాడేటప్పుడు నన్ను ఎవరైనా పరిశీలిస్తున్నారా అనేది గమనించను. నా పని నేను నిజాయితీగా చేయాలనుకుని, నా వరకు నేను పాడేసి వచ్చేస్తాను. అరవంలో ఒక పాట జేసుదాసుగారితో కలిసి పాడుతున్నాను. అందులో కూడా నా నవ్వులు ఉన్నాయి. ఆ పాట పాడుతున్నప్పుడు ఆయన మైక్‌ దగ్గరకు వచ్చి నా ముఖంలోకి చూశారు. నేను అదేమీ పట్టించుకోకుండా నవ్వుల మీద దృష్టి కేంద్రీకరించాను. ఆయన వైపుకి నా దృష్టి మళ్లితే, నా మూడ్‌ దెబ్బ తింటుంది. నా నవ్వులో రొమాంటిక్‌ ఔట్‌లుక్‌ పోతే, పాటలో మూడ్‌ కనపడదు కదా. ‘ఎంత రొమాంటిక్‌గా వస్తోందో నీ నవ్వు’ అని, పాటంతా అయిపోయాక నన్ను ప్రశంసించారు.

‘నా గుండెలోన అందమైన గూడు ఉన్నది/ఆ గూటిలోన నీకే చోటు ఉన్నది/ఆ చోట ఉంటావా నా మాట వింటావా/బులబాటం తీర్చుకుంటావా’ అంటూ సాగుతుంది చరణం. నేను పాట పాడటానికి ముందు, ఆ పాట తాలూకు ఆర్టిస్టు ఎవరో తెలుసుకునేదాన్ని. వారికి తగ్గట్టుగానే డైలాగ్‌లు, నవ్వులు నా గొంతులో పలికిస్తాను. ఈ పాటలో వాణిశ్రీ గొంతు పలికేలా జాగ్రత్తలు తీసుకున్నాను. నాకు గుర్తున్నంతవరకు ఈ పాటను ‘విజయా గార్డెన్స్‌’లో రికార్డ్‌ చేశారు. పాట రికార్డింగు కొన్ని గంటలలోనే పూర్తి చేసేశాం. రోజుల తరబడి పాడేవాళ్లం కాదు. అందరం బిజీ కదా. ఎక్కువ సేపు రిహార్సల్స్‌ చేయటానికి సమయం ఉండేది కాదు. 
‘మా ఇంటి వెనుక సన్నజాజి పందిరుంది/ఆ పందిరి కింద మల్లెపూల పానుపున్నది/ఆ పాన్పు అడిగింది ఈ రాణి ఎవరంది/మన కోసం చూస్తూ ఉంది’. ఈ పాట మొత్తం ఘంటసాల గారే పాడారు. నేను కేవలం నవ్వులు చిందించాను. అంతే. 
తమిళ హాస్యనటి మనోరమకు నేను చాలా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను. నన్ను ఆంధ్ర మనోరమ అనేవారు. సంగీత దర్శకులు చక్రవర్తిగారు నగేశ్‌కి, నేను మనోరమకు జంటగా గాత్రదానం చేసేవాళ్లం. ఎందుకోగానీ ఈ చిత్రం టైటిల్స్‌లో నా పేరు వేయలేదు. 
సంభాషణ: డా. వైజయంతి పురాణపండ

Advertisement
Advertisement