రద్దీలో రైలెక్కడం కోసం.. ఏం చేస్తారంటే..

specail story on tokyo railway station

ట్రెయిన్‌ వచ్చి ప్లాట్‌ఫామ్‌పైన ఆగుతుంది. ఆ వెంటనే ప్రయాణికుల తోపులాట మొదలువుతుంది. ఒకరినొకరు తోసుకోవడం...తిట్టుకోవడం...కొట్టుకోవడం మామూలే.. ఎక్కడ చూసినా ఇదే సీన్‌.. జపాన్‌లోని రైల్వే స్టేషన్స్‌లో కూడా రద్దీ ఇలాగే ఉంటుంది. అక్కడ పీక్‌ అవర్స్‌లో ట్రెయిన్‌లోకి ఎక్కడం అంత ఈజీ కాదు.. మరి అప్పుడు వాళ్లేం చేస్తారు ?  

టోక్యో...! జపాన్‌ రాజధాని.  ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రతగల నగరాల్లో ఇదొకటి. బుల్లెట్‌ ట్రెయిన్లు మొదటిసారిగా ప్రారంభించింది ఇక్కడే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తూ ప్రయాణికులకు, టూరిస్టులకు మెరుగైన సేవలందిస్తోంది ఇక్కడి రైల్వే వ్యవస్థ. జపాన్‌లో ప్రజలు ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణిస్తారు. నిత్యం వందలాది ట్రెయిన్స్‌ ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేకుండా పరుగులు పెడుతూ ఉంటాయి.

ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా...ఎన్ని ట్రెయిన్స్‌ ఉన్నా... పీక్‌ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. టోక్యో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులతో ఉదయం, సాయంత్రం వేళల్లో టోక్యోలోని పలు  రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతూ ఉంటాయి. మామూలుగా ప్రతి అయిదు నిమిషాలకు ఒక ట్రెయిన్ వస్తుంది. రద్దీ వేళల్లో రెండు మూడు నిమిషాలకే ఒక రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తుంది. అంటే గంటకు 24 ట్రెయిన్స్‌ నడుస్తూ ఉంటాయన్నమాట. ఇన్నేసి ట్రెయిన్స్‌ ఉన్నా రద్దీ వేళల్లో ప్రయాణికుల తాకిడి మామూలుగా ఉండదు.

ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి ఆగిన రైలులోకి అడుగుపెట్టడం ప్రయాణికులకు కత్తి మీద సాములాంటిది. ఎదుటనున్నవారిని తోసుకుంటూ లోపలికి వెళ్లాల్సిందే. కంపార్ట్‌మెంట్‌లో పట్టినంత మంది పట్టగా మిగిలిన వాళ్లు డోర్ల వద్దే ఉండిపోతారు. కాలు పెట్టగలిగినంత స్థలం దొరికినా అదే అదృష్టం అనుకుని మెల్లిగా లోపలికి దూరిపోతారు.

లోపలికి వెళ్లే స్థలం లేక డోర్ల వద్ద ప్రయాణికులు వేలాడుతూ ఉండడం వల్ల ట్రెయిన్‌ డోర్లు మూసుకోవు. ఏ ఒక్క డోరు పడకున్నా ట్రెయిన్‌ మూవ్‌ కాదు. ఇలాంటి సమయంలోనే పుషర్స్‌కు చేతినిండా పని దొరుకుతుంది. జపనీస్‌లో వీరిని ఓషియా అని పిలుస్తారు. వీరినే రైల్వే స్టేషన్‌ అటెండెంట్స్‌ అని కూడా అంటారు.  అటూ ఇటూ కాకుండా తలుపుల వద్ద వేలాడుతూ ఉన్న ప్యాసెంజర్స్‌ను బలవంతంగా లోపలికి నెట్టడమే వీరి పని.

రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంకాలం వేళల్లో ఈ పుషర్స్‌కు చాలా పని ఉంటుంది. చేతులకు తెల్లటి గ్లౌవ్స్‌తో, రైల్వే యూనిఫామ్‌తో ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వర్తిస్తూ ఉంటారు పుషర్స్‌. సాధారణంగా ఇక్కడి స్టూడెంట్స్‌ పుషర్స్‌గా ఉదయం, సాయంకాలం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తుంటారు.  

ట్రెయిన్‌ ఆలస్యం కాకుండా ప్రయాణికులను లోపలికి తోస్తూ అటూఇటూ పరిగెడుతూ ఉంటారు పుషర్స్‌. ఎంత రద్దీ ఉన్నా ప్యాసెంజర్స్‌తో పుషర్స్‌ మర్యాదగా ప్రవర్తిస్తారు. డోర్లు పట్టడం లేదని అడ్డంగా ఉన్నవారిని బయటకు లాగెయ్యడం.. మహిళలను అసభ్యంగా తాకడం లాంటి పనులు చేయరు. పదండి...పదండి...అంటూ వీలైనంత ఎక్కువ మందిని ట్రెయిన్‌లోకి తోసెయ్యడమే వారి కర్తవ్యం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top