స్వేచ్ఛకోసం తపించిన ఒక సీతాకోక చిలుక

A French Papiyan And Henri Charriere Story - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

ఫ్రెంచ్‌ గయానా. 1941. హత్యారోపణ ఎదుర్కొని దోషిగా తేలిన హెన్రి షెరిఎర్‌ ఒక అసాధారణమైన పనికి సిద్ధపడ్డాడు. అది డెవిల్స్‌ ఐలాండ్‌ జైలు నుంచి పారిపోవడం. కింద భయంకరమైన అలలు, సొరచేపలు ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి వేచిచూస్తూ వుంటాయి. అయినా పంజరంలోంచి ఎగిరిపోవడానికి చేసిన తొమ్మిదేళ్ళ అన్వేషణే హెన్రి షెరిఎర్‌ కథ. పారిపోవడం అసాధ్యమని తెలిసీ హెన్రి తొమ్మిది సార్లు ప్రయత్నించాడు.

1930ల ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఫ్రాన్స్‌ అప్పుడప్పుడే ఎదుర్కొంటున్న రోజుల్లో పాపియాన్‌ జర్నీ ప్రారంభమైంది. 24 ఏళ్ళ షెరిఎర్‌ విధ్వంసం సృష్టించిన మొదటి ప్రపంచ యుద్ధం రోజుల్లో పెరిగినవాడు. ఇప్పుడు నిష్ణాత సేఫ్‌ క్రాకర్‌ (ఇనప్పెట్టెలు పగలగొట్టేవాడు)గా పారిస్‌ వీధుల్లో సంచరిస్తున్నాడు. ఫ్రెంచ్‌ అండర్‌ వరల్డ్‌లో జెంటిల్‌మాన్‌ దొంగగా పేరుగాంచాడు. హెన్రి ఛాతీ మీదున్న సీతాకోకచిలుక పచ్చబొట్టు తన అందమైన ముద్దుపేరుకు ప్రేరణే కాదు, స్వతంత్రం పట్ల అతనికున్న ప్రేమకు వీలునామా కూడా (సీతాకోకచిలుకని ఫ్రెంచ్‌లో పాపియాన్‌ అంటారు).

కానీ 1930లో స్వతంత్రం అతన్నుంచి లాగేసుకోబడింది. అమ్మాయిలతో వ్యభిచారం చేయించే ఒకడిని చంపినందుకు షెరిఎర్‌ని విచారణకు నిలుచోబెట్టారు. ఈ హత్య చేయలేదనీ, అమాయకుడననీ చెప్పుకున్నాడు. ఒక ముఖ్య సాక్షి పోలీసుల నుంచి లంచం తీసుకుని ఒక కట్టు కథని అల్లి సాక్ష్యంగా చెప్పాడని అంటాడు. అక్టోబర్‌ 26, 1931న ఏదేమైనప్పటికీ షెరిఎర్‌ దోషిగా తేలాడు. ఫ్రెంచ్‌ గయానా జైలులో జీవిత ఖైదు విధించింది కోర్టు. చాలామంది ఇతర ఖైదీలతో ఫ్రెంచ్‌ గయానాకి సముద్రం గుండా ప్రయాణం అయ్యాడు. 1854 నుండి 1946 మధ్య ఫ్రెంచ్‌ గయానాలో శిక్ష విధింపబడిన 7000 మంది ఖైదీలలో పాపియాన్‌ ఒకడు.

జైలులో ఖైదీలు నిప్పుల కొలిమి లాంటి ఎండలో వొళ్ళు హూనమైపోయేలా పని చెయ్యాలి. జైలుకి కొద్ది దూరంలోనే వున్న సముద్రంలో మూడు ద్వీపాలు వుంటాయి. అందులో అతి క్రూరమైంది డెవిల్స్‌ ఐలాండ్‌. ఇక్కడ తొంబైశాతం మంది వారి శిక్షా కాలం ముగియక ముందే చనిపోయేవారు. ఫ్రాన్స్‌ అనే గొప్ప దేశం ఇంత అనాగరికమైన ఫ్రెంచ్‌ గయానా జైలుని తయారుచేయడం అనే వైరుధ్యం షెరిఎర్‌కి ఒక చేదైన అనుభవం.

జైలులో తను వుండడం కేవలం తాత్కాలికం అనే పట్టుదలతో ఉండేవాడు. నేర జీవితం వైపు నడిపించిన ధిక్కార స్వభావమే జైలు నుండి పారిపోడానికీ ప్రేరేపించింది. నేల మీద నుంచి తప్పించుకోడం ఆత్మహత్య చేసుకోవడం వంటిది అయితే సముద్రం గుండా తప్పించుకోవడం కూడా అటువంటిదే. గార్డ్స్‌ కళ్ళు గప్పి పడవను తయారుచేయడం అసాధ్యమైన పని. అప్పుడప్పుడు కొంతమంది చిన్ని పడవను తయారుచేసి పారిపోడానికి ప్రయత్నించేవారు. కాని ఆ భయంకరమైన అలల ధాటికి పడవలు నిలిచేవి కావు. అయినప్పటికీ షెరిఎర్‌ అదే మంచి మార్గం అని భావించాడు. పథకం పారడానికి కావలిసిన డబ్బుని ఫ్రెంచ్‌ గయానా లోకి రహస్యంగా తెప్పించుకున్నాడు.

మూడేళ్ళు బందీగా వున్న తర్వాత మొదటిసారి రహస్యంగా తెప్పించుకున్న డబ్బుతో కొన్న పడవలో పారిపోయాడు. అతడి గమ్యం వెనిజులా. అతడి ప్రయాణం ట్రినిడాడ్‌ మీదుగా కెరిస్సా వరకు సవ్యంగానే సాగింది. కానీ బ్రిటిష్‌ హోండురస్‌ వద్ద విధి అడ్డం తిరిగింది. కొలంబియన్‌ పోలీస్‌ లాంచీ వాళ్ళు పట్టుకున్నారు. రియో ఆర్చర్‌ అనే కొలంబియన్‌ టౌన్‌ జైలులో పడేసారు. ఇక ఫ్రెంచ్‌ గయానాకి పోవడం కోసం ఎదురుచూస్తున్న షెరిఎర్‌ కి శిథిలావస్థలో వున్న గోడలో ఒక బలహీనత కనపడింది. జైలు కిటికీకి వున్న వూచలు విరుచుకుని బయటపడ్డాడు. వెనిజులా సరిహద్దు దగ్గర వహీర ఇండియన్ల తెగ దగ్గర తలదాచుకున్నాడు. వారు షెరిఎర్ని తమ తెగలోకి అంగీకరించారు. అక్కడ ఇద్దరిని భార్యలుగా స్వీకరించాడు. 

జైలు నుంచి బయటపడ్డాక ఇటువంటి గమ్యస్థానం వుంటుందంటే చాలామంది పారిపోయిన ఖైదీలకు అది అపురూపం. కాని షెరిఎర్‌కి కాదు. వారి మధ్య ఏడు నెలలు వున్న తర్వాత అక్కడనుంచి బయలుదేరిపోయాడు. ఒకేచోట నియమ నిబంధనలతో రోజువారీ పనులు చేయడం భరించలేకపోయాడు. ఇక్కడ జీవితం కూడా జైలు జీవితంలానే అనిపించింది. 

అక్కడ నుండి బయలుదేరి వెనిజులా వెళ్ళే దారిలో ఒక కొలంబియన్‌ చర్చిలో ఆశ్రయం పొందాడు. కానీ ఒక నన్‌ అతడిని వంచించి పోలీసులకి అప్పగించింది. ఈసారి కొలంబియన్‌ పోలీసులు షెరిఎర్‌ని తిరిగి ఫ్రెంచ్‌ గయానా జైలుకి తరలించారు. ఫ్రెంచ్‌ గయానాలోని సెయింట్‌ జోసెఫ్‌ ఐలాండ్‌లో తప్పించుకోడానికి ప్రయత్నించిన ఖైదీలను రెండేళ్ళు చీకటి బోనులో ఒంటరిగా నిర్బంధిస్తారు. టైగర్‌ కేజ్‌లుగా పిలవబడే ఆ ఇనుప బోనుల్లో నిశ్శబ్దం పాటించాలి. గార్డ్‌తో గొణిగినా శిక్షకి మరో నెల కూడుతుంది. దారుణమైన నరకయాతన. కొన్ని దశాబ్దాల తర్వాత షెరిఎర్‌ అంటాడు ‘‘చైనీయులు water dripping on the head (ఎటూ కదలనీకుండా మనిషి కాళ్ళు, చేతులు కట్టేసి పైనుంచి ఒక్కో నీటి చుక్క తల మీద పడుతూ చివరకు మనిషిని వెర్రి వాడిని చేస్తుంది) కనుక్కుంటే, ఫ్రెంచ్‌ వాళ్ళు నిశ్శబ్దాన్ని కనుక్కున్నారు’’ అని . 

చరిత్రలో ఏ ఖైదీ కూడా టైగర్‌ కేజ్‌ నుండి తప్పించుకోలేదు. పారిపోవాలన్న ఆలోచనను హెన్రి కూడా వదిలేసాడు. తన ముందున్న ఒకే సవాలు – బ్రతకడం, మరో రోజు తప్పించుకోడం కోసం బ్రతకడం. ఒంటరితనం భరించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రతి రాత్రి తను సృష్టించుకున్న హాయయిన ప్రపంచంలోకి జారుకొనేవాడు. అలసిపోవడం వల్ల వూపిరి తీసుకోడం చాలామటుకు నిలిపేసేవాడు. ఆక్సిజన్‌ సరిగా అందకపోవడం, ఇంకా అలసత్వం రెండూ కలిసి మెదడుని దాదాపు  hypnotic state లోకి తీసుకెళ్తాయి. పదిహేడేళ్ళ ముందే చనిపోయిన వాళ్ళ అమ్మ పియానో మీద మెలడీస్‌ ప్లే చేయడాన్ని తలుచుకునేవాడు. రెండేళ్ళు గడిచిపోయాయి. మనిషి మనస్సుని ఛిన్నాభిన్నం చేయడం కోసం ఈ శిక్ష ఉద్దేశించబడింది. కానీ షెరిఎర్‌ తన ప్రపంచం విరిగిపోకుండా బయటపడ్డాడు. 

అన్నిటికంటే గొప్ప ఎస్కేప్‌ని ప్రయత్నించాలని, అది అతనికి ఏదో ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదా సంపాదించి పెడుతుందని షెరిఎర్‌కి రాసి పెట్టుందేమో. చరిత్రలో డెవిల్స్‌ ఐలాండ్‌ నుండి పారిపోయిన మొదటివ్యక్తి తనే అంటాడు షెరిఎర్‌. టైగర్‌ కేజ్‌ నుంచి బయటపడగానే పారిపోవాలనే ఆలోచనలు మళ్ళీ జీవం పోసుకున్నాయి. పథకం వేసుకుని అది అమలయ్యే సమయానికి సహచర ఖైదీ గార్డ్‌కి సమాచారం ఇచ్చేశాడు. కోపంతో హెన్రి ఆ ఖైదీని చంపేశాడు. 1931లో ఏ నేరమైతే తను చెయ్యలేదని చెప్పాడో అదే నేరాన్ని ఇప్పుడు చేశాడు. దాన్ని చాలా సంవత్సరాల తర్వాత ఇలా సమర్థించుకుంటాడు 'the best school of crime is jail' అని. మళ్ళీ రెండోసారి రెండేళ్ళు టైగర్‌ కేజ్‌లో ఒంటరిగా నిర్బంధించారు.

1939. ఐదు వేల మైళ్ళ దూరంలో షెరిఎర్‌ దేశస్తులు జాతీయ సంక్షోభాన్ని ఎదురుకుంటున్నారు. హిట్లర్‌ సైన్యం పోలెండ్‌ను ఆక్రమించాక ఫ్రాన్స్‌ ఇంకా బ్రిటన్, నాజీ జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జూన్‌ 1940లో పారిస్‌ ఆక్రమించబడింది. టైగర్‌ కేజ్‌లో షెరిఎర్‌ రెండో విడత శిక్షాకాలం కూడా ముగిసింది. ఎప్పటిలానే తన ఆలోచనలన్నీ పారిపోవడం మీదనే ఉండేవి. కానీ 1941లో పారిపోవడం అసాధ్యం అనబడే డెవిల్స్‌ ఐలాండ్‌ జైలుకి షెరిఎర్‌ని తరలించారు. డెవిల్స్‌ ఐలాండ్‌ 35 ఎకరాల్లో వుంటుంది. ఫ్రెంచ్‌ గయానా లోని మూడు ద్వీపాల్లో ఇదే చిన్నది. 

అలలనూ, సొరచేపలనూ దాటి ద్వీపానికి దూరంగా వెళ్ళినా అవతలి ఒడ్డున నరమాంస భక్షకుల దాడికి గురయ్యే అవకాశం వుంది. ఒడ్డున కొండ మీద ఒక పెద్ద రాయిపై కూర్చుని అలలను చూస్తూ రోజులు గడిపేవాడు. కొన్ని వారాల అధ్యయనం తరువాత ఆ అలలు కొండకింద రాళ్ళను గుద్దుకునే తీరు అసాధారణంగా అనిపించింది. గుట్ట కింద రాళ్ళను ఢీకొట్టే ప్రతీ ఏడో అల దాని వెనుక వచ్చే అలలను అణిచివేస్తూ వుండడం గమనించాడు. ప్రతీ ఏడో అల ద్వీపం నుండి దూరంగా వెనక్కు వెళ్లిపోతూ వుంది రాళ్ళను ఢీకొన్న తర్వాత. ఆ ఏడో అలలా తాను కూడా  పారిపోవచ్చని అనుకున్నాడు. రెండు గుడ్డ పేలికలు, నీటిలో తేలే కొబ్బరికాయలతో ఒక ముడి తెప్పను తయారుచేసాడు. 

తన అవకాశాలను మెరుగుపర్చుకోడానికి అలలు భీకరంగా వుండే పౌర్ణమి రాత్రిని ఎంచుకున్నాడు. 36 గంటల నరకం తర్వాత సౌత్‌ అమెరికన్‌ తీరానికి చేరుకున్నాడు. అక్కడనుంచి వెనిజులాకి ప్రయాణం అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఫ్రెంచ్‌ గయానా లోని అధికారులకి ఫ్రాన్స్‌ నుండి సహాయ సహకారాలు నిలిపివేయబడ్డాయి. పారిపోయిన షెరిఎర్‌ ను వెతికి పట్టుకోవడం కంటే మించిన సమస్యలతో అధికారులు సతమతమవుతున్నారు. అందుకని షెరిఎర్‌ పారిపోయింది వాళ్ళు పట్టించుకోలేదు. హెన్రి షెరిఎర్‌ జీవితం మానవ మనసు లాఘవానికి స్ఫూర్తినిచ్చే చిరునామా. కానీ అతడి కథ నిజమా? లేకపోతే పాపియాన్‌ కట్టు కథ అల్లి మోసం చేయడానికి పాల్పడ్డాడనే క్రిటిక్స్‌ మాట నిజమా? 

పాపియాన్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వెనిజులాలో తర్వాతి మూడు దశాబ్దాలు బతికాడు. పెళ్లి చేసుకుని నీతివంతమైన జీవితాన్ని గడిపాడు. 1951లో ఫ్రెంచ్‌ గయానా జైలు మూతపడడం చూసి ఆనందించాడు. 1969లో ‘పాపియాన్‌’ నవల ప్రచురింపబడిన వెంటనే విపరీతమైన జనాదరణ పొందింది.   రాత్రికి రాత్రి ఒక పూర్వ ఖైదీ సాహిత్య సంచలనంగా మారిపోయాడు. దీన్ని తెలుగులోకి ఎం.వి.రమణారెడ్డి ‘రెక్కలు చాచిన పంజరం’ పేరిట అనువదించారు.

పాపియాన్‌ ఫ్రెంచ్‌ గయానా జైల్లో ఖైదీ అన్నది వాస్తవమే అని క్రిటిక్స్‌ ఒప్పుకున్నప్పటికీ తను చెప్పిన కథ చాలా వరకు కల్పించిందనీ ఇతర ఖైదీల అనుభవాలనుంచి తీసుకున్నదనీ అంటారు. షెరిఎర్‌ తనకు తానుగా జెంటిల్‌ మాన్‌ సేఫ్‌ క్రాకర్‌గా చెప్పుకోవడం డాక్యుమెంట్ల పరంగా అబద్ధం అంటాడు జిరడివియే. 1973లో చనిపోయేవరకు కూడా పాపియాన్‌గా పిలవబడే హెన్రి షెరిఎర్‌ తను రాసింది నిజమే అన్నాడు.

పాపియాన్‌ చెప్పింది వాస్తవం కానివ్వండి, కల్పితం అయినా కానివ్వండి, నిజంగానే హత్య చేసిన నేరస్తుడు కానివ్వండి, ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అతని కథ ప్రతిధ్వనిస్తూనే వుంది. పాపియాన్‌ నేను బ్రతకాలి అనే దృఢ సంకల్పంతోనే బ్రతికాడు. ఈ తప్పించుకోవడంలో ఒక అద్భుతమైన సందేశం వుంది : ‘‘దారుణమైన విధి ప్రతికూలతలను అధిగమించే సామర్థ్యం మనుషులకు వుంది. అధర్మం, వేదన ఎక్కువగా వున్న ఈ భయానక ప్రపంచంలో కూడా జీవితేచ్ఛే రాజ్యమేలుతుంది’’.(తిరుపతిలో శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ‘మానవ వికాస వేదిక’ ఏర్పాటైన సందర్భంగా)


భూమన కరుణాకరరెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top