ఓటెత్తని రాజధాని.. కారణాలేమి?

ఓటెత్తని రాజధాని.. కారణాలేమి? - Sakshi


ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, థియేటర్లు, మాల్స్కు సెలవు ప్రకటించినా, వాతావరణం అనుకూలించినా కూడా హైదరాబాద్లో ఓటింగ్ ఏమాత్రం పెరగలేదు. కేవలం 53.4 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. తెలంగాణలో 72 శాతానికి పైగా సగటు ఓటింగ్ నమోదైతే, రాజధాని నగరంలో మాత్రం దాదాపు సగం మందే ఓట్లేశారు. ప్రతినిధులను ఎన్నుకోవడంలో తమకు ఏమాత్రం ఆసక్తి లేనట్లు ప్రవర్తించారు. ఎన్నికల రోజు సెలవు, మేడే, మధ్యలో ఒక్కరోజు సెలవు పెడితే మళ్లీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఐదు రోజుల సెలవులు వచ్చాయన్న కారణంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు.. ఇలాంటి వాళ్లంతా తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దాంతో వాళ్ల కుటుంబ సభ్యుల ఓట్లేవీ పోల్ కాలేదు.



దీనికితోడు ఈసారి ఎన్నికల్లో ఎప్పుడూ లేనట్లుగా భారీ మొత్తంలో ఓట్లు గల్లంతయ్యాయి. ఒకే ఇంట్లో కొడుకు ఓటు ఉంటే, తల్లి ఓటు లేకపోవడం, భార్యకు ఓటు ఉంటే భర్తకు ఓటు లేకపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. ముందుగానే ఓటర్ల జాబితాలను ఇంటర్నెట్ సహా అన్ని పోలింగ్ కేంద్రాలలో పెట్టామని చెప్పినా, వాటికి.. పోలింగ్ కేంద్రాల్లో బుధవారం నాడు ఉన్న జాబితాలకు పొంతన కనపడలేదు. పూర్తి అవగాహన ఉన్నవాళ్లు తమ పేర్లు, సీరియల్ నెంబరు, బూత్ నెంబరు.. ఇలా అన్ని వివరాలను ఓటు వేయడానికి వెళ్లే ముందు చూసుకుని దాని ప్రకారం వెళ్లారు. అది తెలియని వాళ్లు గుర్తింపు కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డులు తీసుకుని వెళ్లినా, ఓటర్ల జాబితాలో పేర్లు లేవన్న కారణంతో వాళ్లను ఓటు వేయనివ్వలేదు. ఇక ఇంటింటికీ తిరిగి పోలింగ్ స్లిప్పులు పంచుతామని, ఇళ్లలో ఎవరైనా లేకపోయినా ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తామని కూడా చెప్పినా.. కనీసం 60 శాతం మందికి కూడా పోలింగ్ స్లిప్పులు అందలేదు. పొడవాటి క్యూ లైనులో నిలబడి, పోలింగ్ బూత్ లోపలకు వెళ్లిన తర్వాత అప్పుడు మళ్లీ గేటు బయటకు వెళ్లి, అక్కడ ఇస్తున్న పోలింగ్ స్లిప్పులు తెచ్చుకోవాలని సిబ్బంది చెప్పారు. ఇలాంటి అనేక కారణాలతో పోలింగ్ బూత్ వరకు వచ్చినవాళ్లు కూడా ఓట్లు వేయలేకపోయారు.



సీనియర్ ఐఏఎస్ అధికారి పి.రాధా, సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ప్రచారకర్త, సినీనటుడు బ్రహ్మానందం.. ఇలా అనేకమంది గత ఎన్నికల సమయంలోను, ఇప్పుడు కూడా ఒకే చోట ఉంటున్నా, వారి ఓట్లు కూడా గల్లంతు అయ్యాయి. ఇంతకుముందు ఒక ఇంట్లో ఉండి, ఇప్పుడు మరో ఇంటికి మారితే ఓటర్ల జాబితాలోంచి పేరు పోతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ చెప్పారు. కానీ, ఒకే ఇంట్లో ఏళ్లతరబడి ఉంటున్నవాళ్లవి కూడా కొందరి ఓట్లు ఉండటం, మరికొందరివి గల్లంతు కావడం వెనక ఏం జరిగిందో మాత్రం తెలియట్లేదు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top