దారి తప్పిన ఉన్నత విద్యావంతులు | Sakshi
Sakshi News home page

దారి తప్పిన ఉన్నత విద్యావంతులు

Published Wed, Aug 22 2018 9:21 AM

Smugglers Arrest In Hyderabad - Sakshi

నాగోలు: గోవా నుంచి గంజాయి, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను నగరంలో సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.1.15 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు.కేరళకు చెందిన మహ్మద్‌ షమ్మీద్, అత్తాపూర్‌కు చెందిన ఉజీర్‌ అహ్మద్, రామంతాపూర్‌కు చెందిన పుప్పాల వెంకటేష్‌ స్నేహితులు. మహ్మద్‌ షమ్మీద్‌ సౌదీ లోని ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ దామమ్‌లో ఉన్నత విద్యను అభ్యసించాడు. తరచూ నగరానికి వచ్చి వెళ్లే అతను కొద్దిరోజుల పాటు అర్మెక్స్‌ కొరియర్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు.

సౌదీ లో ఉంటున్న తన స్నేహితుడు జోయబ్‌ ద్వారా అత్తాపూర్‌కు చెందిన హమీద్, పుప్పాల వెంకటేష్‌కు పరిచయం ఏర్పడింది. ఎమ్మెస్సీ పట్టభద్రుడైన వెంకటేష్, పీహెచ్‌డీ చేస్తూనే యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌లో కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అంతేగాక అతడికి అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఎంఎన్‌సీల్లో పని చేసిన అనుభవం ఉంది.  2017లో హైదరాబాద్‌కు వచ్చిన అతను రామంతపూర్‌లో ఉంటున్నాడు. మహ్మద్‌ షమ్మీద్, ఉజీర్‌ అహ్మద్‌తో కలిసి తరచూ గోవా వెళ్లి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, గంజాయి, హెరాయిన్‌ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ జోన్‌ ఎస్‌ఓటీ బృందం, ఉప్పల్‌ పోలీసులు రామంతాపూర్‌లోని వెంకటేష్‌ నివాసంపై దాడి చేసి గంజాయి,హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, రూ.3వేల నగదు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సయ్యద్‌ రఫిక్, సీఐ రవికుమార్, వెంకటేశ్వర్లు, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement