10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో | Zomato set for create more jobs CEO Deepinder Goyal | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే 10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో

Sep 9 2019 9:43 AM | Updated on Sep 9 2019 10:00 AM

Zomato set for create more jobs CEO Deepinder Goyal - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ ఫుడ్‌‌ డెలివరీ, రెస్టారెంట్‌‌ సెర్చ్‌‌ సేవల సంస్థ జొమాటో శుభవార్త చెప్పింది. త్వరలోనే  తాము లాభాల్లోకి మళ్ల నున్నామని, దీంతో మరింత మంది ఉద్యోగులను  చేర్చుకోనున్నామని ప్రకటించింది. టెక్నాలజీ, ప్రొడక్ట్‌‌, డేటా సైన్సెస్‌‌ టీమ్స్‌‌ కోసం ఈ నియామకాలు కొనసాగుతాయన్నారు. గత ఐదేళ్లలో తమ వ్యాపారం పదిరెట్లు పెరగడంతో వేలాది మందికి ఉపాధి కల్పించడం సాధ్యపడిందని చెప్పారు.  ఇదిలావుంటే గురుగ్రామ్‌‌లోని కంపెనీ హెడ్‌‌ ఆఫీస్‌‌లో పనిచేసే 540 మంది ఉద్యోగులను శనివారం తొలగించింది. కస్టమర్‌‌ సర్వీస్‌‌ అవసరం తగ్గడం వల్ల కొంతమందిని తీసేసిన మాట నిజమేనని, అయితే గతంలోకంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని  జొమాటో ఫౌండర్‌‌, సీఈఓ దీపిందర్‌‌ గోయల్‌ వెల్లడించారు.

ఆగస్ట్ నెలలో 60 మందిని తొలగించిన అనంతరం, ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. అటు ఈ సంవత్సరం తాము 1200 మందిని కొత్తగా నియమించుకున్నామని, మరో 400 మంది ఆఫ్ రోల్ పొజిషన్లో ఉన్నారని జొమాటో తెలిపింది. ప్రస్తుతం తాము టెక్నాలజీ, ప్రోడక్ట్, డేటా సైన్స్ టీమ్స్‌ను నియమించుకుంటున్నామన్నారు.  అయితే ఉద్యోగుల తీసివేత నిర్ణయం బాధాకరం అయినప్పటికీ తప్పలేదని,  ఉద్యోగాలు కోల్పోయినవారికి సీనియారిటీ ప్రకారం రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి చివరి వరకు పలు ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారి కోసం జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని తెలిపింది.  అలాగే ఉద్యోగాల కోత  ఖర్చులు తగ్గించుకునేందుకు కాదని కంపెనీ స్పష్టం చేసింది.

మరోవైపు జొమాటో తన తొలి లాభాలను ఛేదించే దిశగా ఉందని సీఈఓ గోయల్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 10రెట్ల వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నామని గోయల్ చెప్పారు.  ఈ క్రమంలో 2 లక్షల 30వేల మంది పార్టనర్స్‌తో తొలిసారి రూ. 200 కోట్ల మార్క్‌ను అధిగమించామని తెలిపారు. కొత్త నగరాల్లోకి వేగంగా విస్తరించడం, ఔట్‌లెట్లు 'డార్క్ కిచెన్'లను విస్తరించడం కారణంగా వేలాది ఉద్యోగాలను సృష్టించడంతో పాటు లాభాల బాటపట్టామని తెలిపారు. గత మూడు నెలల్లో  నష్టాలు 50 శాతం తగ్గాయి. ఏ క్షణమైనా లాభాలు మొదలుకావొచ్చని గోయల్‌‌ ప్రకటించారు. గత సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగిన ఆహార పంపిణీ వ్యాపారంలో, తామింకా  భారీగా పెట్టుబడులు పెడుతున్నామన్నారు. దీంతో  ఒక్క  సెప్టెంబరులోనే  10వేల  కొత్త ఉద్యోగాలను జోడించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని గోయల్‌ చెప్పారు. 

కాగా 2008లో మొదలైన జొమాటో ఇప్పుడు 24 దేశాల్లోని పది వేల నగరాల్లో ఫుడ్‌‌ డెలివరీ సేవలు అందిస్తోంది. మనదేశంలోని 500 నగరాల్లో 2.5 కోట్ల మందికి ఆహారం డెలివరీ ఇస్తోంది. ఎనలిస్టుల అంచనాల ప్రకారం జొమాటో వాల్యుయేషన్‌‌ 3.6 బిలియన్‌‌ డాలర్ల  4.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. సిలికాన్‌‌ వ్యాలీ వెంచర్‌‌ ఫండ్‌‌  సికోనియా క్యాపిటల్‌‌, టెమాసెక్‌‌ హోల్డింగ్స్‌‌, ఇండియన్ ఈ–కామర్స్‌‌ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్‌‌ జొమాటోలో ఇన్వెస్ట్‌‌ చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement