హవాలా.. దివాలా తీసినట్లేనా?
దేశవిదేశాల్లో నగదు బదిలీకి నిన్నమొన్నటి వరకు పెద్ద సాధనంగా ఉపయోగపడిన హవాలా రాకెట్ ప్రధాని మోదీ కొట్టిన ఒక్క మాస్టర్ స్ట్రోక్‌తో కుదేలైంది.
దేశవిదేశాల్లో నగదు బదిలీకి నిన్నమొన్నటి వరకు పెద్ద సాధనంగా ఉపయోగపడిన హవాలా రాకెట్ ప్రధాని మోదీ కొట్టిన ఒక్క మాస్టర్ స్ట్రోక్‌తో కుదేలైంది. ముంబైలో పెద్దపెద్ద హవాలా రాకెటీర్లు చాలామంది పనిలేక గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్దనోట్లు రద్దు చేయడం, ఇంకా మార్కెట్లోకి పూర్తిస్థాయిలో కొత్త నోట్లు రాకపోవడంతో అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హవాలా వ్యాపారులు తల పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఎవరికి వాళ్లు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకుని, కొత్త నోట్లను పదిలంగా కాపాడుకుంటుడటంతో.. మార్కెట్లోకి కొత్త కరెన్సీ పెద్దగా రావట్లేదు. కనీసం మరో వారం పది రోజుల పాటు హవాలా నడిచే పరిస్థితి అన్నదే లేదని అంటున్నారు.
బుధవారం నాడు ముంబైలోని ఒక హవాలా ఆపరేటర్ దాదాపు 500 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను కాల్చేశాడని, ఇదంతా వేర్వేరు వ్యక్తులకు ఇవ్వాల్సిన మొత్తమని విశ్వసనీయంగా తెలిసింది. ఇలా ఎంతమంది ఎంత మొత్తాన్ని తగలబెట్టేశారో ఇంకా బయటకు రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు తమ ఇబ్బందులు తీరే మార్గం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. హవాలా మార్కెట్ మొత్తం నల్లధనం మీదే నడుస్తుంది. కానీ ఈ నల్లధనం మార్కెట్ పునాదులే ఇప్పుడు కదిలిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో ఎవరికీ అర్థం కావడంలేదు. ఒక్క వారం పది రోజులు ఆగి చూస్తే అసలు ఏం చేయగలమో తెలుస్తుందని, ఈలోపు కంగారు పడి అనవసరంగా డబ్బులు కాల్చేయడం లాంటి పనులు చేయొద్దని వాళ్లలో వాళ్లు చెప్పుకొంటున్నారు. సగటున ముంబైలో హవాలా వ్యాపారం రోజుకు 2-3వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
ఎక్కువగా బెట్టింగ్, వజ్రాలు, బంగారం వ్యాపారంలో ఈ డబ్బు ఉపయోగిస్తారు. కొందరు బిల్డర్లు కూడా హవాలా మార్గాన్నే ఆశ్రయిస్తారు. చిన్న వ్యాపారులు కూడా నల్లధనం మీదే ఆధారపడతారని, ముంబైలో వీళ్లంతా హవాలా మార్గంలోనే డబ్బులు పంపుతారని ఓ వ్యాపారి చెప్పారు. గుజరాత్ లాంటి ఇతర రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో ఇదంతా చాపకింద నీరులా ఎప్పటినుంచో ఉందన్నారు. ఇప్పుడు అంతా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు.