చిరుత.. చిక్కింది | Sakshi
Sakshi News home page

చిరుత.. చిక్కింది

Published Fri, Aug 26 2016 12:34 AM

చిరుత.. చిక్కింది - Sakshi

‘అనంత’లో కలకలం..
* చిరుత దాడిలో ఇద్దరు యువకులకు గాయాలు
* వలవేసి పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

రాయదుర్గం: జనారణ్యంలోకి వచ్చిన రెండు చిరుతలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో కలకలం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి అడవిలో నుంచి పట్టణంలోకి వచ్చిన రెండు చిరుతలు స్థానిక ఈ-సేవా సెంటర్ సమీపంలోని ముళ్లపొదల్లో ఉన్న పందులపై దాడి చేసి వాటిని తిని అక్కడే చిక్కుకుపోయాయి. ఉదయం వేళలో ఓ చిరుత వెళ్లిపోగా, మరో చిరుత అక్కడే ఉండిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో ఓ యువకుడు బహిర్భూమి కోసం ముళ్లపొదలవైపు వెళ్లడంతో చిరుత కనిపించింది. దీంతో వెంటనే అతను పట్టణంలోకి వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు.

ఈ క్రమంలోనే కొందరు యువకులు చిరుతపై రాళ్లు వేయడంతో అది రవినాయక్ అనే యువకుడిపై దాడి చేసింది. అతను స్వల్పంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కిన చిరుత అడ్డుకోబోయిన జాఫర్ అనే యువకుడిని గాయపర్చింది. మరోసారి ప్రయత్నించిన అటవీశాఖ సిబ్బంది స్థానికుల సాయంతో చిరుతను వలలో బంధించారు. చిరుతను తిరుపతి జూకు తరలించనున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు తెలిపారు.

Advertisement
Advertisement