అండర్‌పాస్‌ పనుల్లో కదలిక | Sakshi
Sakshi News home page

అండర్‌పాస్‌ పనుల్లో కదలిక

Published Tue, Apr 16 2024 1:55 AM

జాతీయ రహదారిపై చిన్నకొండూరు 
క్రాస్‌ రోడ్డు వద్ద మట్టి, రాళ్ల నమూనాల సేకరణ - Sakshi

చౌటుప్పల్‌లో మూడు చోట్ల

అండర్‌పాస్‌ల నిర్మాణం

మొదలైన సాయిల్‌ టెస్టింగ్‌ పనులు

మట్టి,రాళ్ల శాంపిళ్ల సేకరణ

పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలింపు

రిపోర్టు రాగానే బ్రిడ్జీల పనులు ప్రారంభం

చౌటుప్పల్‌ : హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ పట్టణంలో వెహికిల్‌ అండర్‌పాస్‌ నిర్మాణ పనులు (వీయూపీ) మొదలయ్యాయి. సోమవారం సాయిల్‌ టెస్ట్‌ పనులు చేపట్టారు. గత నెల టెండర్లు పూర్తయిన విషయం తెలిసిందే. హరియాణ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్‌ సంస్థ అండర్‌పాస్‌ బ్రిడ్జి పనులు దక్కించుకుంది.

మూడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు

సింగిల్‌ లేన్‌గా ఉన్న జాతీయ రహదారిని 14 ఏళ్ల క్రితం నాలుగు లేన్లుగా మార్చారు. అయినప్పటికీ రహదారిపై ప్రమాదాలు తగ్గలేదు. ప్రధానంగా గ్రామాలు, పట్టణాలు, జంక్షన్ల వద్ద ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. కాగా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ వరకు ప్రమాదకర ప్రాంతాలు, జంక్షన్లు, బ్లాక్‌స్పాట్‌లను ప్రమాదరహితంగా మార్చేందుకు గత మూడేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాధించింది. అందుకు అవరసరమైన నిధులను మంజూరు చేసింది. వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో టెండర్లు పూర్తయ్యాయి. అండర్‌పాస్‌లు లేకుండా రహదారి నిర్మాణం జరిగిన చౌటుప్పల్‌, చిట్యాల పట్టణాల్లో ప్రమాదాల నివారణకు వెహికిల్‌ అండర్‌ పాస్‌లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు చౌటుప్పల్‌లో ఆర్టీసీ బస్టాండ్‌, వలిగొండ క్రాస్‌ రోడ్డు, చిన్నకొండూర్‌ – తంగడపల్లి చౌరస్తాల మధ్య మూడు చోట్ల అండర్‌పాస్‌లు రానున్నాయి. వీటితో పాటు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే దారిలో కూడా అండర్‌పాస్‌ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆరు లేన్లకు అనుగుణంగా నిర్మాణం

చౌటుప్పల్‌ పట్టణంలో అండర్‌పాస్‌ బ్రిడ్జి పనులు ప్రారంభం అయ్యాయి. అండర్‌పాస్‌ పిల్లర్లు పటిష్టంగా ఉండటానికి భూమిలో బలాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం 100 ఫీట్ల నుంచి 150 ఫీట్ల లోతు వరకు సాయిల్‌ టెస్టు చేయనున్నారు. ప్రతి రెండున్నర మీటర్లకు ఒకసారి మట్టి, రాళ్ల శాంపిల్స్‌ సేకరిస్తారు. సేకరించిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నారు. భూమి గట్టితనాన్ని బట్టి ఆ ప్రాంతంలో పిల్లర్లను డిజైన్‌ చేస్తారు. ఇందుకు సంబంధించి సాయిల్‌ టెస్టింగ్‌ పనులు సోమవారం మొదలయ్యాయి. ఒక్కో పాయింట్‌ సాయిల్‌ టెస్టింగ్‌ కోసం రెండు రోజుల సమయం పడుతుంది. భూమి నాణ్యత తేలిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరు వరుసల రహదారి డిజైన్‌కు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణం జరగనుంది.

Advertisement
Advertisement