‘ఈఎన్‌టీ’లో కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ సర్జరీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

‘ఈఎన్‌టీ’లో కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ సర్జరీలు ప్రారంభం

Published Fri, Dec 1 2023 1:00 AM

కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ చేసిన చిన్నారితో వైద్య బృందం  - Sakshi

● వినికిడి లోపం కలిగిన చిన్నారులకు వరం ● ఆరోగ్యశ్రీలో ఉచితంగా రూ.7 లక్షలు విలువైన చికిత్స

ఏయూక్యాంపస్‌: పుట్టుకతో చెవుడు, మూగతో జన్మించిన చిన్నారికి కొత్త జీవితాన్ని అందించారు. ప్రభుత్వ చెవి ముక్కు గొంతు ఆస్పత్రిలో కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ సర్జరీలను పునఃప్రారంభించారు. అమలాపురం కొమరగిరికి చెందిన కె.దివ్య వెంకట సత్యకు బుధవారం కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ జి.హరికృష్ణ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా చిన్నారికి రూ.7 లక్షలు విలువైన ఆ ఆపరేషన్‌ చేసి కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ చేశామన్నారు. దీనికి అవసరమైన కాక్లియర్‌ పరికరాలను సైతం ప్రభుత్వమే నేరుగా సరఫరా చేస్తోందన్నారు. త్వరలో మరో చిన్నారికి సైతం ఇదే విధమైన ఆపరేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమ ఆస్పత్రిలో 65 మందికి ఈ విధమైన ఆపరేషన్లు చేసినట్టు వెల్లడించారు. పుట్టుకతో చెవుడు, మూగతో జన్మించిన వారికి ఈ చికిత్స వల్ల వినిపించడం జరుగుతుందన్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ అందించి మాట్లాడటం నేర్పుతామన్నారు. చిన్నారులు కొత్త జీవితం ఆరంభించడానికి కాక్లియర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇటువంటి సమస్యతో వచ్చిన చిన్నారులను ఆస్పత్రిలో పరీక్షించి అవసరమైనవారికి కాక్లియర్‌ సర్జరీలు చేసి ఇన్‌ప్లాంట్‌ చేస్తున్నామన్నారు. అనంతరం వీరికి నాలుగు దశల్లో ఆడియో, వెర్బల్‌ థెరపీలో శిక్షణ అందిస్తామన్నారు. ఒక ప్రణాళాకాయుతమైన వ్యవస్థ తమ ఆస్పత్రిలో ఉందన్నారు. నిపుణులైన, సుశిక్షితులైన వైద్యబృందం చిన్నారులకు పూర్తి స్థాయిలో సేవలను అందిస్తుందన్నారు.

ప్రభుత్వమే సరఫరా చేస్తోంది

ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సకు అవసరమైన కాక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి అవసరమైన ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. గతంలో ముందుగా కొనుగోలు చేసి తరువాత బిల్లులు పెట్టుకునే వ్యవస్థ ఉండేది. దీనిని మార్పు చేస్తూ ప్రభుత్వం ముందుగానే కొనుగోలు చేసి పరికరాలను అందిస్తోంది.

Advertisement
Advertisement