ఆగం కావొద్దు | Sakshi
Sakshi News home page

ఆగం కావొద్దు

Published Thu, Nov 9 2023 7:14 AM

-

బీఆర్‌ఎస్‌ను నమ్మి..

తాండూరు: మాయమాటలతో ఓట్లు దండుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు వస్తారని, వారిని నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్‌ పార్టీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి సూచించారు. బుధవారం తాండూరులోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మల్‌రెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన ప్రచారం ఇందిరానగర్‌, గుండుపీర్లు, గాంధీచౌక్‌ మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులే అన్ని రకాలుగా బాగుపడ్డారని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు భూ కబ్జాలతో కాలం గడిపారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే తప్పదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఏ ఒక్కరికీ అందలేదని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో లక్షలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కొత్తగా పథకాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తోందన్నారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోరాదని సూచించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. ప్రతి ఏటా ఎకరా పంట సాగుకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేల చొప్పున సాయం చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామన్నారు. ప్రతి నెలా మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకులు తనను నాన్‌ లోకల్‌అంటున్నారని, ఇది అవాస్తవమన్నారు. తాను 25 ఏళ్ల క్రితమే తాండూరులో ఇల్లు కట్టుకున్నట్లు తెలిపారు. తన కొడుకులు కూడా తాండూరులోనే చదువుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నిన్నమొన్న ఇల్లు కట్టుకొని లోకల్‌ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సునితాసంపత్‌, బషీరాబాద్‌ మాజీ జెడ్పీటీసీ రాకేష్‌ మహరాజ్‌, నాయకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, అబ్దుల్‌ రవూఫ్‌, పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత, నాయకుడు ప్రభాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేసిందేమీ లేదు

కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోంది

పార్టీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి

Advertisement
Advertisement