
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
33 జీపీలు..
దౌల్తాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
నిర్వహణకు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కరువయ్యారు. ఒక్కో ఎఫ్‌ఏ రెండు మూడు గ్రామాల బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. దీంతో పర్యవేక్షణ గాడి తప్పుతోంది. కొత్త జీపీలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడంతో ప్రస్తుతం పాతపంచాయతీల్లోని వారే పనులను పర్యవేక్షిస్తున్నారు.
గాడి తప్పుతున్న పర్యవేక్షణ
మండలంలో 20 కొత్త పంచాయతీలు, కొత్తగా ఏర్పడినవి 13 కలిపి మొత్తం 33 జీపీలు ఉండగా.. ప్రస్తుతం 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయా గ్రామాల్లోని కూలీలకు పదిశాతం కన్నా తక్కువ పనిదినాలను కల్పించారనే కారణంతో నలుగురిని తొలగించారు. దీనికి తోడు కొత్తగా ఏర్పడిన 13 జీపీలకు ఎఫ్‌ఏలను నియమించలేదు. వాస్తవానికి ఒక్కో గ్రామానికి ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ చొప్పున విధులు నిర్వర్తించాలి. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం వీరి నియామకాలు చేపట్టడం లేదు. ప్రస్తుతం కొత్త పంచాయతీల బాధ్యతలను సైతం పాత జీపీల్లో విధులు నిర్వహిస్తున్న వారికే అప్పగించారు. రెండు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను చేయించాల్సి రావడంతో ఫీల్డ్‌అసిస్టెంట్లపై పనిభారం పెరుగుతోంది. పనుల పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ప్రస్తుతం ఎఫ్‌ఏలు లేని 22 జీపీల్లో సీనియర్ మేట్లకు పనుల బాధ్యతలు అప్పగించారు. వీరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ఉపాధి కల్పించడంలో విఫలం కావడంతో కూలీల సంఖ్య పెరగడంలేదు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంతో మేట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీల మస్టర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు వేతనాల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడుతోంది. ఇప్పటికైనా అన్ని జీపీల్లో ఎఫ్‌ఏలను నియమించి, పనులు చేపట్టాలని కూలీలు కోరుతున్నారు.
ఉపాధి హామీ వివరాలు
గ్రామ పంచాయతీలు 33
జాబ్‌కార్డులు 28,649
నమోదైన కూలీలు 15,955
పనిచేసే కుటుంబాలు 1800
కూలీలకు కల్పించిన పనిదినాలు 1,77,534
వంద రోజులు పని పూర్తయిన కుటుంబాలు 26
ముందుకు సాగని ఉపాధి పనులు
ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌కు రెండుమూడు గ్రామాల బాధ్యతలు
కొత్త పంచాయతీల్లో మేట్లతోనే పనుల నిర్వహణ
పారదర్శకత లోపిస్తున్న వైనం
పట్టించుకోని ఉన్నతాధికారులు
పనులు చేయిస్తున్నాం..
కొత్త జీపీల్లో ఎఫ్‌ఏల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించకపోవడంతో ఆయా పంచాయతీల్లో సీనియర్ మేట్ల ద్వారా పనుల నిర్వహణ, పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రతీ గ్రామానికి ఎఫ్‌ఏను నియమించాలని ఆదేశిస్తే నిబంధనల ప్రకారం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– రజనీకాంత్, ఏపీఓ, దౌల్తాబాద్
