హైదరాబాద్: పండగవేళ ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో ఓ యువకుడి తొందరపాటు నిర్ణయం విషాదాన్ని నింపింది. షేర్‌మార్కెట్‌లో నష్టపోయి మనస్థాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైతన్యపురి ఎస్‌ఐ రమేష్ తెలిపిన మేరకు.. చైతన్యపురి సాయినగర్ కాలనీలో నివసించే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తమ్మిశేట్టి శ్రీనివాస్ కుమారుడు ప్రవీణ్ (34) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి ప్రవీణ్ తీవ్రంగా నష్టపోయాడు. ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రవీణ్ రాత్రి వరకు తిరిగి రాకపోవటంతో చైతన్యపురి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పెట్రోల్ బంక్ సమీపంలో బిల్డింగ్ వద్ద మృతదేహం
చైతన్యపురి పెట్రోల్ బంక్ సమీపంలోని ఎయిర్‌టెల్ షోరూం బిల్డింగ్ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల వల్ల సుమారు రూ.35 లక్షల వరకు నష్టపోయిన ప్రవీణ్ కుటుంబంలో, బంధువులలో పరువు పోతుందని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందని ఎస్‌ఐ తెలిపారు.
ఇదీ చదవండి: జీతం బాగున్నా జాబ్ వదిలేస్తున్నారు.. అసలు కారణం ఇదే!


