తెలంగాణ: మరో 1,931 కేసులు | Sakshi
Sakshi News home page

మరో 1,931 కేసులు

Published Fri, Aug 14 2020 2:27 AM

Another 1931 Positive Cases Of Coronavirus Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 18,562 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు ప్రతిరోజూ 140 పరీక్షలు చేయాలి. దాని ప్రకారం తెలంగాణలో ప్రతిరోజూ పరీక్షల లక్ష్యం 5,600 అని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం బులెటిన్‌ విడుదల చేశారు. ఇప్పటివరకు ఆంగ్లంలోనే బులెటిన్‌ విడుదల చేస్తున్న ప్రభుత్వం... మొదటిసారిగా తెలుగులోనూ విడుదల చేసింది. ఇంగ్లిష్‌లో 68 పేజీల బులెటిన్‌ విడుదల చేయగా ముఖ్యమైన అంశాలను తెలుగులో ఐదు పేజీల్లో పొందుపరిచింది. 

తాజాగా కోలుకున్న 1,780 మంది బాధితులు.. 
రాష్ట్రంలో బుధవారం (12వ తేదీన) ఒక్కరోజే 23,303 పరీక్షలు నిర్వహించగా 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 86,475కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 665కి చేరింది. తాజాగా 1,780 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 63,074కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 6,89,150 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 22,736 ఉండగా అందులో హోం లేదా ఇతర సంస్థల ఐసోలేషన్‌లో 15,621 మంది ఉన్నారని ఆయన వివరించారు.

లక్షణాలు లేకుండా ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉన్న వారు 84 శాతంగా ఉన్నారని తెలిపారు. వైరస్‌ మరణాల్లో కరోనాతో చనిపోయినవారు 46.13 శాతం ఉండగా, ఇతరత్రా వ్యాధుల వల్ల మరణించిన వారు 53.87 శాతం ఉన్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల పడకలు 17,734 ఉండగా అందులో 2,662 నిండిపోయాయి. ఇంకా 20,396 పడకలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో సాధారణ పడకలు 12,284 అందుబాటులో ఉండగా ఆక్సిజన్‌ పడకలు 5,861, ఐసీయూ పడకలు 2,251 ఖాళీగా ఉన్నాయని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 298, వరంగల్‌ అర్బన్‌లో 144, రంగారెడ్డి జిల్లాలో 124, కరీంనగర్‌ జిల్లాలో 89, నల్లగొండలో 84, ఖమ్మం జిల్లాలో 73, మల్కాజ్‌గిరి జిల్లాలో 71, జగిత్యాల జిల్లాలో 52, జనగామలో 59, జోగులాంబ గద్వాల జిల్లాలో 56, నాగర్‌ కర్నూల్, నిజామాబాద్‌ లో 53, పెద్దపల్లిలో 64, సిరిసిల్ల జిల్లాలో 54, సంగారెడ్డి జిల్లాలో 86, సిద్దిపేటలో 71, సూర్యాపేటలో 64 కేసులు ఉన్నాయని వెల్లడించారు. 21–50 ఏళ్ల మధ్య వయసుగల వారే అత్యధికంగా కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు పైబడినవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులు, లేబొరేటరీల వల్ల ఏవైనా సమస్యలుంటే పరిష్కారం కోసం 9154170960 వాట్సాప్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement