సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో కార్మిక సంఘాలు అధికారంలోకి వచ్చేందుకు విస్తృత ప్రచారాలు నిర్వహించాయి. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఈయూ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు అందించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు కార్మికులు గట్టి షాక్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నిక తుది ఘట్టానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 98 శాతం పోలింగ్ నమోదైంది. బరిలోకి దిగిన మూడు కూటముల్లో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 11 రీజియన్లలో ఎనిమిదింటిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైంది. ఇందులో 5 రీజియన్లలో ఈయూ కూటమి, 3 రీజియన్లలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించాయి. ఎన్నికల ఫలితాలు ఈయూ కూటమికే అనుకూలంగా ఉండడంతో తమ గెలుపు ఖాయమని ఈయూ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, దూర ప్రాంత సర్వీసులకు డ్యూటీకి వెళ్లిన సిబ్బంది 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయనున్నారు. ఆ సంఖ్య వందలలోనే ఉంటుందని, ఫలితాలపై ప్రభావం చూపదని ఈయూ తెలిపింది. ఈ నెల 17న ఫలితాలు అధికారికంగా వెలువడనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో ఓటమిపై అధికార కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సరళిపై నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ప్రత్యర్థి యూనియన్‌కు మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం వల్ల ఓడిపోయారని రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. ఖమ్మం, నల్లగొండ మినహా మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు ఎన్నికలను పట్టించుకోలేదని తేలింది. కాగా, ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందని భావించిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక, గ్రేటర్ పరిధిలో 26 యూనిట్లలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో కాంగ్రెస్‌లో అంతర్మథనం నెలకొంది.
ఇదీ చదవండి: తెలంగాణ: పండుగ ప్రయాణం భారమే


