శ్రీకాకుళం క్రైమ్ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, నేర నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణపై విశాఖపట్నం రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) గోపినాథ్ జెట్టి రేంజి పరిధి ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
మెళియాపుట్టి: మండలంలోని గంగరాజ పురం గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగుడు కై లాష్ (25) శనివారం అదే గ్రామంలోని చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. యువకుడు ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఎంతగా గాలించినా లాభం లేకపోయింది. సాయంత్రం చెరువులో తేలుతూ కనిపించడంతో బయటకు తీసి ఒడిశా గారబంద ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కవిటి : ముత్యాలపేటకు చెందిన సన్నకారు రైతు రెయ్యి అప్పలస్వామి(100) శనివారం తన స్వగృహం వద్ద వయోభారంతో మృతిచెందారు. చనిపోయే వరకు తన దైనందిన కార్యక్రమాలను సొంతంగానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు.
నరసన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ శనివారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బగ్గు జయలక్ష్మి, సుజాత, జ్ఞానేశ్వరి, గిరిజ, శైలజ, కల్పనలు మాట్లాడుతూ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని, వంద శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, ట్రాన్స్‌ఫర్ సదుపాయం కల్పించాలని, మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కాశీబుగ్గ : పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రి వైద్యులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడంపై ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ రోగులు వైద్యుల కోసం నిరీక్షించడాన్ని గమనించారు. ఆరా తీస్తే 17 మందికి ఇద్దరు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఆస్పత్రిలో సేవలందించడంలో జాప్యం వహించడం సరికాదన్నారు. విధులకు ఆలస్యంపై తగిన కారణాలతో నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పలాస రైల్వే గేటువద్ద చేపడుతున్న ఆర్‌వోబీ పనులను పరిశీలించారు.
గార : జైలులో ఉన్న ప్రతీ ఖైదీకి రాజ్యాంగం కల్పించిన న్యాయం సహాయం అందిస్తామని, నిరుపేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చూడటం న్యాయ వ్యవస్థ భాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. శనివారం అంపోలు పరిధిలోని జిల్లా జైలును సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


