‘ప్లాన్ లేదు.. ఏమీ లేదు; ఆడుకుంటూ పోయామంతే’ | Sanju Samson Reveals-Secret Behind-Historic Chase Vs NZ 1st T20I | Sakshi
Sakshi News home page

‘ప్లాన్ లేదు.. ఏమీ లేదు; ఆడుకుంటూ పోయామంతే’

Oct 23 2026 7:55 AM | Updated on Oct 23 2026 8:57 AM

Sanju Samson Reveals-Secret Behind-Historic Chase Vs NZ 1st T20I

Photo Credit: BCCI Twitter

క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అత్యధిక పరుగుల టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించడంలో ఓపెనర్ సంజూ సామ్సన్ కీలకపాత్ర పోషించాడు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసిన సామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. కాగా మ్యాచ్ అనంతరం సంజూ సామ్సన్ మాట్లాడుతూ.. 226 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఎలాంటి ప్లాన్‌లు వేసుకోలేదని, ప్రతీ బంతిని హిట్టింగ్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకొని ఆడుకుంటూ పోయామని తెలిపాడు. 

సామ్సన్ మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మతో కలిసి నెలకొల్పిన మెరుపు ఓపెనింగ్ భాగస్వామ్యం వెనుక కూడా ఎలాంటి ప్రణాళిక లేదని, వచ్చిన ప్రతీ బంతిని బాదడమే తమ ఓపెనింగ్ జోడీ లక్ష్యంగా పెట్టుకున్నాం.  బ్యాటింగ్ సమయంలోనూ మా మధ్య చాలా సంభాషణ జరిగింది. కానీ ఎంత చర్చించుకున్నా బంతిని బాదడమే ఇద్దరం టార్గెట్‌గా పెట్టుకున్నాం. 

అభిషేక్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం నేను ఎప్పుడు ఇష్టపడుతాను. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతున్న విషయాన్ని గమనించాము. అందుకే పవర్ ప్లేలో వికెట్ పారేసుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ రన్‌రేట్ పడిపోకుండా చూసుకున్నాం. ఓపెనింగ్ మంచి ఆరంభం లభించడంతో ఆ తర్వాతి బ్యాటర్లకు పరుగులు చేయడానికి మార్గం సుగమమైంది. ఆరు ఓవర్లలో 90 పరుగులు రావడం అనేది మంచి ఆరంభం. 

అభిషేక్‌, నేను ఔటైన తర్వాత కాస్త ఒత్తిడి నెలకొన్నప్పటికీ, కెప్టెన్ అయ్యర్‌, అక్షర్ పటేల్‌, నమన్ ధీర్‌లు చక్కగా ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. మ్యాచ్ విజయంలో నా ఒక్కడికి క్రెడిట్ ఇచ్చుకోను. ఇది అందరి సమిష్టి విజయం. ఇవాళ్టి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ను మాత్రం బాగా ఆస్వాదించాను. రెండో టీ20 కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కివీస్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిన్‌ అలెన్‌(45), బెవాన్‌ జాకబ్స్‌(31) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌పటేల్‌, మయాంక్‌ యాదవ్‌ తలా వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. సామ్సన్ (67), శ్రేయస్ అయ్యర్ (42), నమన్ ధీర్ (15 బంతుల్లో 42 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్‌, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం ఇదే వేదికలో జరగనుంది.

ఇదీ చదవండి: చ‌రిత్ర సృష్టించిన‌ జో రూట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement