PC: CSA/X
చేదు జ్ఞాపకాల నడుమ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం డర్బన్ వేదికగా తొలి టెస్టు మొదలుకానుంది.
గుట్టు మొత్తం విప్పేస్తా!
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు.. ‘సాండ్‌పేపర్ గేట్’ గురించి ప్రశ్న ఎదురైంది. నాడు కంగారూ జట్టు ఆటగాళ్లు కుటిలనీతికి పాల్పడగా.. ‘ఈ విషయం గురించి ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన పుస్తకంలో కూలంకశంగా వివరించనున్నాడని.. గుట్టు మొత్తం విప్పనున్నాడనే ప్రచారం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి’ అని కొందరు విలేకరులు కమిన్స్‌ను అడిగారు.
మాకు ఎలాంటి భయం, బాధ లేవు
ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్ని వారాల క్రితమే తన ఆటోబయోగ్రఫీ గురించి ఉజ్ (ఉస్మాన్ ఖవాజా) నాతో చర్చించాడు. త్వరలోనే పుస్తకం విడుదల చేయబోతున్నానని తెలిపాడు. అయితే, అందులో ఈ వివాదం గురించి వివరంగా ఏమీ రాయడం లేదని నాకు తెలిసింది.
ఆ ఘటనకు సంబంధించి అందరికి తెలిసిందే.. అంటే ప్రాథమిక సమాచారం మాత్రమే ఇచ్చాడనుకుంటా. ఈ విషయంలో మాకు ఎలాంటి భయం, బాధ లేవు. ఇందులో అతడు తన కథను చెప్తాడు. అది మంచిదే కదా!
ఏదేమైనా ఆ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిగింది. ప్రతీ ప్రశ్నకు మేము లెక్కకు మిక్కిలిసార్లు సమాధానాలు ఇచ్చాము. జట్టుగా మేమంతా కలిసే ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాము. ప్రస్తుతం మేము ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాము.
గత ఎనిమిది, తొమ్మిదేళ్లుగా మేము గొప్ప జట్టుగా ఎదిగాము. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సారథిగా జట్టును ముందుకు నడిపించడం మీదే ఉంది’’ అని కమిన్స్ స్పష్టం చేశాడు.
అప్పుడు ఏం జరిగింది?
ఆస్ట్రేలియా 2018లో నాలుగు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. తొలి టెస్టులో ఆసీస్ గెలవగా.. మిగిలిన మూడు టెస్టులు గెలిచి ప్రొటిస్ సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది.
అయితే, కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఆతిథ్య బ్యాటర్ల దూకుడు అడ్డుకట్ట వేసేందుకు నాటి ఆసీస్ ఓపెనర్ కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారం మార్చేందుకు సాండ్ పేపర్‌ను ఉపయోగించాడు.
ముగ్గురిపై నిషేధం
ఈ క్రమంలో బ్యాన్‌క్రాఫ్ట్ చేసిన పని కెమెరాల కంటికి చిక్కడంతో వివాదం మొదలైంది. నాడు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ విషయం తెలిసి కూడా బ్యాన్‌క్రాఫ్ట్ చేసిన పనిని అడ్డుకోలేదని తెలిసింది. దీంతో స్మిత్, వార్నర్‌పై ఏడాది, బ్యాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం పడింది.
అంతేకాదు.. వార్నర్ భవిష్యత్తులో కెప్టెన్ కాకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే, కాలక్రమేణా స్మిత్ మళ్లీ పూర్వ వైభవానికి చేరుకుని.. తాత్కాలిక కెప్టెన్‌గానూ పనిచేయగా.. వార్నర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక బ్యాన్‌క్రాఫ్ట్ ఆసీస్ జట్టు నుంచి కనుమరుగైపోయాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న ఆసీస్ జట్టులో.. నాడు కేప్‌టౌన్ టెస్టులో భాగమైన స్మిత్, కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియోన్ కూడా ఉన్నారు.
ఖవాజా మాట వినలేదా?
ఇదిలా ఉంటే.. సాండ్‌పేపర్ వివాద సమయంలో ఉస్మాన్ ఖవాజా జట్టుగా అందరం ఒకే తాటి మీద ఉండాలని, సమిష్టి బాధ్యత వహించాలని సహచరులకు సూచించాడని.. అయితే, అతడి మాటల్ని ఎవరూ లెక్కచేయలేదని ఒక ఆసీస్ మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయం గురించి అతడు తన ఆటోబయోగ్రఫీలో రాశాడా? లేదా? అన్నది నవంబరులో పుస్తకం విడుదలైన తర్వాతే తెలుస్తుంది.
చదవండి: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో తెలుసు కదా!: టీమిండియా దిగ్గజం
అప్పుడు ఐదు ఎకరాల భూమి.. ఇప్పుడు 3 ఖరీదైన అపార్టుమెంట్లు


