కలవని చేతులు! | Sakshi
Sakshi News home page

కలవని చేతులు!

Published Fri, Nov 17 2023 4:24 AM

- - Sakshi

ప్రచారానికి దూరంగా టికెట్‌ దక్కని నేతలు ● పలువురు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు యత్నాలు ● నియోజకవర్గాల ఇన్‌చార్జుల కృషి ఫలించేనా?

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ నేతలు కలిసిరావడంలేదు. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌లను ఎక్కువ మందే ఆశించారు. పార్టీ అధిష్టానం పలు సర్వేలు నిర్వహించి, పలు కేటగిరీలలో టికెట్లను కేటాయించింది. రెండు దఫాలలో అభ్యర్థులను ప్రకటించారు. సిద్దిపేట నుంచి 15 మంది, దుబ్బాక నుంచి ఐదుగురు, హుస్నాబాద్‌ నుంచి ఆరుగురు నేతలు గాంధీభవన్‌లో దరఖాస్తు చేశారు. అక్టోబర్‌ 27న సిద్దిపేట కాంగ్రెస్‌ అభ్యర్థిగా పూజల హరికృష్ణ, దుబ్బాక అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌ను పార్టీ ప్రకటించింది.

సరైన గుర్తింపు లేకనే..

సిద్దిపేట, హుస్నాబాద్‌, దుబ్బాకలలో టికెట్‌ ఆశించిన నేతలు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రభాకర్‌ నామినేషన్‌ వేసే సమయంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డి వెంట ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. ప్రవీణ్‌రెడ్డి వర్గం నేతలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నాయకులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక టికెట్‌ కోసం చివరి వరకు శ్రవణ్‌కుమార్‌ తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్‌ రాకపోవడంతో ఎన్నికల ప్రచారానికి దూరం అయ్యారు. శ్రవణ్‌కుమార్‌ వర్గం నేతలకు గుర్తింపు ఇవ్వడం లేదన్న కారణంగానే నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్‌ ఆశించిన మరో నేత కత్తి కార్తీక సైతం ప్రచారంలో పాల్గొనడం లేదు. బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

సిద్దిపేటలోనూ..

సిద్దిపేటలో 15 మంది టికెట్‌ ఆశించగా అందులో నలుగురు ముఖ్యనాయకులున్నారు. పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం, జిల్లా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు సూర్యవర్మ, సీనియర్‌ నాయకులు గుడూరు శ్రీనివాస్‌, తాడూరి శ్రీనివాస్‌లు టికెట్‌ ఆశించారు. టికెట్‌ ప్రకటించిన ఐదు రోజులకు మేమంతా ఒక్కటేనని, హరికృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. తర్వాత ప్రచారంలో ఈ నలుగురు నాయకులు పాల్గొనకపోవడం గమనార్హం. ఇందులో ఓ ఇద్దరు నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

అసంతృప్తులను కలుపుకొని వెళ్తేనే..

ఆయా నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలుగా గతంలోనే పలువురిని నియమించారు. వారు అసంతృప్తి నేతలతో మాట్లాడి అందరినీ ఒక్కతాటి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోటీ చేసే అభ్యర్థులు సైతం అసంతృప్తులను కలుపుకొని వెళ్తేనే ఓటర్లను తమవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. లేనట్లయితే ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement