Sakshi News home page

పాలిచ్చే బర్రెను అమ్ముకోవద్దు

Published Sun, Apr 14 2024 7:55 AM

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు - Sakshi

పథకాలు లేక క్యాలెండర్లతో బీజేపీ ప్రచారం

ఎన్నికల హామీలు

అమలు చేయని కాంగ్రెస్‌

ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డిని గెలపించండి

సంగారెడ్డి యువ సమ్మేళనంలో హరీశ్‌

సంగారెడ్డి: పాలిచ్చే బర్రెలాంటి బీఆర్‌ఎస్‌ను నమ్ముకోవాలి కానీ.. అమ్ముకోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీకి పథకాలు లేక క్యాలెండర్లతో ప్రచారం చేస్తుందన్నారు. ఎన్నికల హామీలు అందితే కాంగ్రెస్‌కు ఓటెయ్యొచ్చని.. లేదంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. దేశంలో 150 మెడికల్‌ కాలేజీలుంటే కేంద్రం తెలంగాణకు ఒక్కటైనా ఇచ్చిందా అని మండిపడ్డారు. గ్యాస్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. మతాలతో, సెంటిమెంట్లతో పాలిస్తున్నారని దుయ్యబట్టారు. దుబ్బాక బై ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి రఘునందన్‌ గెలిచారని వీడియో, ఆడియో క్లిప్పింగులు స్క్రీన్‌ ద్వారా చూపించారు. కాంగ్రెస్‌ చాలాచోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే యువతకు ఉచిత కోచింగ్‌ సెంటర్లు, ఫంక్షన్‌ హాళ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి దాని ద్వారా తాను చనిపోయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

పనిమంతుడు వెంకట్రామిరెడ్డికి పట్టం కట్టాలి

పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్‌: నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్‌, బీజేపీలు నట్టేట ముంచాయని హరీశ్‌రావు విమర్శించారు. శనివారం రాత్రి పట్టణంలోని జీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పటాన్‌చెరు ప్రాంతంలో గతంలో తాగునీటి గోస ఉండేదని, మిషన్‌ భగీరథ ద్వారా ఆ సమస్య తీర్చామని తెలిపారు. మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్న హామీని రేవంత్‌ మరిచిపోయాడని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి 400 మందికి ఉచితంగా స్కూటీలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. విదేశాల్లో నల్లధనం తీసుకువచ్చి పేదలకు పంచుతామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మాయ మాటలతో గెలిచిన రఘునందన్‌కు దుబ్బాకలో బుద్ధి చెప్పారన్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో ఎలా చెల్లుతుందన్నారు. పనిమంతుడైన బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి లక్ష మెజారిటీ అందిస్తానని తెలిపారు. కేసీఆర్‌, హరీశ్‌ల సహకారంతో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నెల రోజులు నా కోసం పనిచేస్తే.. వచ్చే ఐదేళ్లు మీకు సేవ చేస్తా అని వెంకట్రామిరెడ్డి చెప్పారు. అధికారిగా పని చేశా, ఎంపీగా అవకాశం ఇస్తే సమస్యలపై గొంతు విప్పుతా అని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement