సమ్మర్‌ క్యాంప్స్లోనూ ఏఐ | education with an AI summer camp for teens | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంప్స్లోనూ ఏఐ

Jun 1 2025 4:48 AM | Updated on Jun 1 2025 10:37 AM

education with an AI summer camp for teens

ఆటలకు బదులు సాంకేతికతకు మొగ్గు ఫిజికల్‌ టు డిజిటల్‌కు మారిన వైనం వేసవిలోనేకాదు, ఏడాదంతా శిక్షణ

మారిన సమ్మర్‌ క్యాంప్స్‌ తీరుతెన్నులు  

చెస్, డ్యాన్స్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, పెయింటింగ్‌.. ఇవీ సమ్మర్‌ క్యాంప్స్‌ అనగానే మనకు గుర్తొచ్చేవి. అవి కూడా వేసవి సెలవుల్లోనే నేర్చుకునేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్‌ క్యాంప్స్‌ అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ క్యాంప్స్‌ కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో పాఠశాలలు, కో–కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు.. ఏడాదంతా పిల్లలను వివిధ అంశాల్లో సానబెడుతున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సమ్మర్‌ క్యాంప్స్‌లో ప్రాధాన్యతగా ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) నిలిచి ఔరా అనిపిస్తోంది.  

కోవిడ్‌ సమయంలో.. ముఖ్యంగా లాక్‌డౌన్‌లో విద్యార్థులు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ సమయంలో పాఠశాలలూ ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాయి. దీంతో పిల్లలు మొబైల్‌ ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్లకు అలవాటుపడ్డారు. నాటి నుంచి పిల్లలకు చదువుతోపాటు.. కంప్యూటర్‌ పరిజ్ఞానమూ పెరిగింది. ఆన్‌లైన్‌ వేదికగా పిల్లలు పలు బోధనాంశాలను నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీస్‌కు బదులు ఆన్‌లైన్‌ గేమ్స్‌ అలవాటయ్యాయి. అలా పిల్లల కార్యకలాపాలన్నీ ఫిజికల్‌ టు డిజిటల్‌ అయిపోయాయి. మరోపక్క తల్లిదండ్రులు కూడా సాంకేతికంగా తమ పిల్లల భవిష్యత్తుకు తగ్గ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగానే.. సమ్మర్‌ క్యాంప్స్‌ కూడా చాలావరకు మారిపోయాయి.  

అందుకే పంపుతున్నారు
సమ్మర్‌ క్యాంప్స్‌కు వస్తున్న పిల్లల్లో.. ఎక్కువమంది చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేవారే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలను ఇంట్లో ఉంచలేక, క్యాంప్‌లకు పంపించి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచుతున్నారు. ఇంట్లో అల్లరి భరించలేక లేదా మొబైల్‌ ఫోన్లకు అలవాటు పడ్డారన్న కారణంతో మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్‌ క్యాంప్‌లో చేరి్పస్తున్నారు. చాలాకొద్ది మంది మాత్రమే తమ పిల్లలు కెరీర్‌లో క్రీడలను భాగం చేసుకోవాలని భావించి క్యాంప్‌లకు పంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.  

కొత్త అంశాలు 
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమ్మర్‌ క్యాంప్స్‌ ఇప్పుడు టెక్నాలజీ, అడ్వెంచర్, లైఫ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ, కోడింగ్, ఆస్ట్రానమీ, స్పేస్‌ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలు వచ్చి చేరాయి. అడ్వెంచర్‌లో హార్స్‌ రైడింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. లైఫ్‌ స్కిల్స్‌లో వంటలు, వ్యవసాయం, పశు సంపద గురించి తరగతులు మొదలయ్యాయి. ఆర్చరీ, చెస్‌లతోపాటు ఫొటోగ్రఫీ, సాల్సా, బెల్లీ వంటి డ్యాన్సులు.. మ్యూజిక్‌ కూడా సమ్మర్‌ క్యాంప్స్‌లో నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్, స్కేటింగ్‌ వంటి వాటిలోనూ కొన్నిచోట్ల శిక్షణ ఇస్తున్నారు.  

ఏఐ, ఎంఎల్, కోడింగ్‌.. 
పాఠ్యాంశాలతోపాటు కో–కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో ఇప్పుడు ఏఐ, మెషీన్‌ లెరి్నంగ్, కోడింగ్‌ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఈ తరగతులు సమ్మర్‌ క్యాంప్స్‌నకే పరిమితం కాకుండా ఏడాదంతా ఒక సబ్జెక్ట్‌గా జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే ఎంతోమంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దాంతో పాఠశాలలు కూడా ఈ సబ్జెక్టులను చెప్పిస్తున్నాయి. ఆసక్తికర అంశం ఏంటంటే.. వారంలో ఒక రోజు.. అది కూడా 1–2 గంటలు క్లాస్‌ చెప్పే ఏఐ నిపుణుడికి పాఠశాలలు నెలకు రూ.70,000 వరకు చెల్లిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు చాట్‌ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో కొందరు వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ కూడా చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement