మీ సేవలు అపురూపం | Sakshi
Sakshi News home page

మీ సేవలు అపురూపం

Published Sat, Dec 2 2023 5:02 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం, పక్షపాతం చూపించిన వారిపై వేటు వేసిన నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య.. ఉత్తమ పని తీరు కనబరిచిన వారిని గుర్తించి అభినందించారు. గురువారం పోలింగ్‌ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు తమవంతుగా శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని శుక్రవారం ఆయన అభినందించారు. షాహినాయత్‌గంజ్‌ ఠాణా సరిహద్దు ప్రాంతంలో కొందరు రాజకీయ పార్టీలకు చెందిన పురుషులు, మహిళలు గొడవలు పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మంగళ్‌హాట్‌ ఠాణా ఎస్సై జి.అంబిక గుర్తించారు. తక్షణం అప్రమత్తమైన ఈమె షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన సిబ్బందితో కలిసి ఆమె కూడా గుంపును చెదరగొట్టారు. హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లో బోగస్‌ ఓట్లు వేయడానికి వచ్చిన కొంత మందిని నిలువరించి, వారిని సంబంధిత ఠాణాకు అప్పగించి కేసు నమోదు చేయించడంలో సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ వినయ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషించారు. ఫలక్‌నుమా ఠాణా మహిళా కానిస్టేబుల్‌ కృష్ణకుమారి భోంస్లే కాలాపత్తర్‌ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లో విధులు నిర్వర్తించారు. అక్కడ బోగస్‌ ఓట్లు వేయడానికి వచ్చిన కొందరు వ్యక్తుల్ని అడ్డుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ముగ్గురినీ శుక్రవారం ఐసీసీసీలోని కమిషనరేట్‌కు పిలిపించిన కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య అభినందించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సంయుక్త సీపీ (ఎస్బీ) పి.విశ్వ ప్రసాద్‌ సైతం పాల్గొన్నారు.

మీ పని తీరు అభినందనీయం

పోలీసులకు బహుమతులు అందించిన కొత్వాల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement