‘గుర్తు’ంచుకోండి | Sakshi
Sakshi News home page

‘గుర్తు’ంచుకోండి

Published Sun, May 12 2024 6:05 AM

‘గుర్తు’ంచుకోండి

చివరి రోజు.. ప్రచార హోరు

ఓటు వేయాలంటూ విన్నపాలు

ప్రలోభాలు షురూ

సిరిసిల్ల: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఓటేయమంటూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు జిల్లాలో పక్షం రోజులుగా ప్రచారం సాగించారు. శనివారం సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరిరోజు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇంటింటా తిరుగుతూ పార్టీ అభ్యర్థుల పేరు, గుర్తును ఓటర్లు గుర్తుంచుకునేలా పదేపదే చెబుతూ కరపత్రాలు అందించారు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. దీంతో ఎవరికి వారు తమ అభ్యర్థులను గెలిపించేందుకు తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించారు.

పల్లె నుంచి పట్టణం వరకు..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీలు ఎన్నికల ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం కాస్త తగ్గినా.. అగ్రనేతల రాకతో ఆర్భాటపు ప్రచారాలు సాగించారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు పల్లె నుంచి పట్టణం దాక తిరిగాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ తన ఎన్నికల ప్రచారాన్ని సిరిసిల్లలోనే శనివారం ముగించారు. వేములవాడలో ప్రధాని మోదీ సభ, జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిరిసిల్లలో రోడ్‌ షో నిర్వహించగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు సభలు, సమావేశాలు, మార్నింగ్‌ వాక్‌లు నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం వేములవాడ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు వేములవాడ, సిరిసిల్ల పట్టణాలతో పాటు వివిధ మండలాల్లో ప్రచారం చేశారు. సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభను నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం సాగించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లాలో పలుమార్లు పర్యటించి ప్రచారం చేశారు.

ద్వితీయశ్రేణి నాయకుల ఆరాటం

అన్ని పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ముఖ్య నాయకులతో పాటు ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలాల అధ్యక్షులు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే మహిళలు, యువకులకు డబ్బులు ఇచ్చి రోజుల తరబడి వారితో ప్రచారం చేయించారు. చివరిరోజు ఎక్కువ మందితో ర్యాలీలు నిర్వహించి తమ పట్టును వీధుల్లో ప్రదర్శించారు.

ఓటర్లకు ఎర..

ప్రచార పర్వం నిలిచిపోవడంతో ప్రలోభాలకు తెరలేసింది. సోమవారం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తెరచాటు ఒప్పందాలకు తెరతీశారు. మహిళా సంఘాలను మచ్చిక చేసుకునేందుకు నోట్లను ఎరగా చూపుతున్నారు. ఇప్పటికే కుల సంఘాలతో ఒప్పందం చేసుకున్న నాయకులు మందు విందులిస్తూ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. చివరిరోజు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే అన్ని ప్రాంతాల్లోనూ మందు, విందులతో ప్రలోభాల పర్వం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల శ్రేణులతో మంతనాలు జరుపుతూ భారీగా ఓట్లు సాధించేందుకు ఎవరికివారు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement