రూ.25 లక్షలే తిన్నట్టు రాశారని బాధేమో! | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షలే తిన్నట్టు రాశారని బాధేమో!

Published Mon, Feb 28 2022 9:15 PM

YSRCP MLA Gudivada Amarnath Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించి ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు,  ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. తండ్రి చంద్రబాబు, తానూ కలిసి రాష్ట్రాన్నే దోచుకుతింటే ‘చినబాబు చిరుతిండికి రూ. 25 లక్షలు’ అని మాత్రమే రాశారేంటి అని లోకేశ్‌ బాధలా కనిపిస్తోందని విమర్శించారు. 39 దేశాల రక్షణ అధికారులు పాల్గొన్న ‘మిలాన్‌–2022’ విజయవంతమై విశాఖకు అంతర్జాతీయ కీర్తి రావడం చూసి ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే లోకేశ్‌ ఇక్కడకు వచ్చి నట్లుందన్నారు.

సోమవారం విశాఖలోని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర భారతదేశంలో ఓ నేవీ వార్‌షిప్‌ను జాతికి అంకితం చేసే గొప్ప అవకాశం సీఎం వైఎస్‌ జగన్‌కు వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదన్నారు. తండ్రీకొడుకులిద్దరికీ విశాఖ రాజధాని కావడం,  అభివృద్ధి చెందడం ఇష్టం ఉండదని మరోసారి లోకేశ్‌ నిరూపించారన్నారు. ఏనాడూ తన బంధువులు జూ.ఎన్టీఆర్, బాలయ్య సినిమాలకు రేటింగ్‌ ఇవ్వని తండ్రీకొడుకులు ఓ రీమేక్‌ సినిమాకు ఎందుకు డబ్బా కొడుతున్నారని, రాష్ట్రంలో ఆ తండ్రీకొడుకులకు ప్రజలిచ్చిన రేటింగ్‌ జీరో అని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చదవండి: ‘ఫ్లాప్‌ సినిమాకు చంద్రబాబు మార్కెటింగ్‌’

మీ బాబాయ్‌ సంగతేంటి లోకేశ్‌? 
వైఎస్‌ వివేకా హత్య కేసులో సీఎం జగన్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేయడానికి లోకేశ్‌కు నైతిక హక్కు లేదని అమర్‌నాథ్‌ అన్నారు. లోకేశ్‌ బాబాయ్‌ రామ్మూర్తినాయుడు సంగతేంటని సూటిగా ప్రశ్నించారు. మీ బాబాయ్‌ని గొలుసులతో బంధించి ఇంట్లో ఎందుకు మీ తండ్రి దాచాడో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రామ్మూర్తినాయుడు ఎలాంటి నిజాలు బయటపెడతాడో అని భయపడే పిచ్చివాడనే ముద్రవేసి చైన్ల్‌తో కట్టేసి దాచిపెట్టారా అని ప్రశ్నించారు. అసలు సీబీఐ, సీబీఎన్‌ (చంద్రబాబు), ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్, బి.టెక్‌ రవి, రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ సంభాషణలను పరిశీలిస్తే వైఎస్‌ వివేకా హత్య కేసులో అసలు విషయం బట్టబయలవుతుందన్నారు.  

నువ్వు ఖర్జూర నాయుడికి వారసుడివి  
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండలు వేసినంత మాత్రాన ఎన్టీఆర్‌కి వారసుడివి కాలేవని, ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వ్యక్తికి వారసుడివని లోకేశ్‌ను ఉద్దేశించి అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. అసలు లోకేశ్‌ తన తాత ఖర్జూర నాయుడికి వారసుడు అన్నారు. తండ్రీ కొడుకులకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పొత్తుల్లేకుండా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఓ ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షానికి సలహాలు సూచనలిస్తే తీసుకుంటామని, ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement