తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశంతో అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఎన్నికలు సజావుగా జరపాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుకు తన పాలనపై అంత నమ్మకం, విశ్వాసం ఉంటే, స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆయన సవాల్ చేశారు.
స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే, వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం అంతులేని అక్రమాలకు పాల్పడుతోందని, విపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా నిరోధిస్తోందని ఆయన ఆక్షేపించారు. ఏదేమైనా తమ పోరాటం మాత్రం ఆగబోదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలూ బేఖాతరు
ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవకతవకలను వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) దృష్టికి తీసుకెళ్తోంది. అయినా అక్కణ్నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదు. నామినేషన్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల స్టోర్, కౌంటింగ్ కేంద్రాల్లో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, లైవ్ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచాలని, కేంద్ర పారా మిలటరీ బలగాలు రప్పించాలని, గతంలో గొడవలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని కోరాం. అయినా ఎక్కడా కనీస స్సందన రాకపోవడంతో, చివరకు దేశ సమున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు పరిస్థితి చక్కదిద్దాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.
అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయకుండా, మళ్లీ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. అందుకోసం దాడులు చేస్తున్నారు. ముఖ్య నాయకులందరినీ దౌర్జన్యంగా హౌజ్ అరెస్ట్ చేశారు. అభ్యర్థుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తున్నారు. అయినా ఎన్నికల కమిషన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎస్‌ఈసీ ఇకనైనా వైఖరి మార్చుకోవాలి
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి నామినేషన్ల దాఖలు వరకు కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులపై బెదిరింపులు, దాడులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చింపేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారాయి.
కడపలో మైనారిటీ నాయకుడు నామినేషన్ వేయడానికి వస్తున్నారనే సమాచారంపై వారిని అడ్డుకోవాలని స్థానిక ఎమ్మెల్యే సూచించినట్లు ఆధారాలు ఉన్నాయి. టీడీపీ నేతలు, ఇతర కూటమి నాయకులు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. చింతమనేని ప్రభాకర్ సహా పలువురు నాయకుల వ్యాఖ్యలు మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చాయి. ఈ వ్యవహారాలపై సంబంధిత అధికారులు ఆధారాలను పరిశీలించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోరాటం ఆగదు
కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. పార్టీ అధినాయకత్వం ఇచ్చిన ధైర్యంతో రాజ్యాంగబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం. స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజల్లో ఎండ గడతాం. అటు న్యాయస్థానాల్లోనూ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రక్రియలో ఎక్కడా వెనక్కి తగ్గబోమని వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: జనసేనకు బిగ్‌షాక్.. వైఎస్సార్‌సీపీలో చేరిన పాఠంశెట్టి దంపతులు


