పార్వతీపురం మన్యం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తోంది. ఇందులో విచిత్రం ఏముంది అని అనుకోవద్దు. నిజంగా ఇది విచిత్రమే మరి. ఈమె పేరు కోసూరు జయలక్ష్మి. ఈమె ప్రచారం చేస్తున్నది ఆమె భర్తతో పోటీ పడుతున్న అభ్యర్థిని గెలిపించాలని. స్థానికులంతా ఆశ్చర్యపోయిన ఈ ఘటన బొబ్బిలిలోని 17వ వార్డులో సంభవించింది. ఈమె భర్త కోసూరు బ్రహ్మాజీ 17వ వార్డు టీడీపీ అభ్యర్థి.
ఇతనికి పోటీగా వైఎస్సార్ సీపీ కొమ్మోజు హరిబాబును అభ్యర్థిగా దింపింది. శుక్రవారం ఈ వార్డులో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తూముల అచ్యుతవల్లి, కౌన్సిలర్ అభ్యర్థి హరిబాబులు ప్రచారం చేశారు. ఈ సమయంలోనే జయలక్ష్మి వచ్చి హరిబాబును, జయలక్ష్మి గెలిపించాలని ప్రజలను కోరింది. వైఎస్సార్‌సీపీ కండువా వేసుకుని ప్రచారం చేసింది. తన భర్త తనను మోసం చేశాడని చెబుతోంది. చిన్నపిల్లలున్నప్పటినుంచే ఎడంగా ఉండడంతో ఆమె తన కుమారుడు యశ్వంత్‌తో సహా ప్రచారం చేస్తోంది. మరో విషయం ఏమిటంటే హరిబాబు నామినేషన్ పత్రాలపై యశ్వంత్ సాక్షి సంతకం చేసిన అనంతరం ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ వింతను పట్టణంలోని పలువురు ఆశ్చర్యంగా చూస్తున్నారు.


