మేయర్ పీఠం మాటున ఎంపీ ఆధిపత్య వ్యూహం
సీనియర్లకు చెక్.. ఎమ్మెల్యేల అభ్యంతరాలు బేఖాతరు
తన కనుసన్నల్లో నడిచే నేత కోసమే పావులు?
శ్రావణి ఎంపికపై కూటమిలోనే అసమ్మతి స్వరాలు
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని తన రాజకీయ ఆధిపత్యానికి పావుగా మార్చుకునేందుకు ఎంపీ భరత్ ప్రయత్నిస్తున్నారా? నగర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కంటే తన వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ.. తాను చెప్పినట్లు నడుచుకునే వ్యక్తిని మేయర్ అభ్యర్థి ఎంపిక చేయించుకున్నారా? ముక్కా శ్రావణి అభ్యర్థిత్వంపై కూటమి వర్గాల్లో వినిపిస్తున్న విమర్శలివి. సీనియర్లు, స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను పక్కనపెట్టి ఎంపీ తన మాట నెగ్గించుకున్నారనే అసంతృప్తి టీడీపీలో వ్యక్తమవుతోంది.
తన ఆధిపత్యం కోసమేనా?
టీడీపీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నేతలతోపాటు, తమ కుటుంబాలకు మేయర్ పదవి దక్కాలని ఆశించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే రాజకీయ అనుభవం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి పీఠం అప్పగిస్తే తన ఆధిపత్యానికి అడ్డంకులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఎంపీ భరత్.. శ్రావణి పేరును తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా వ్యవహరించే నాయకత్వం ఉంటే జీవీఎంసీలో కీలక నిర్ణయాలపై పట్టు సాధించవచ్చన్నది ఎంపీ వ్యూహమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
గీతం భూముల వ్యవహారంలోనూ ఇదే వ్యూహం?
గతంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని పదవి నుంచి తప్పించిన పరిణామాలను ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కొందరు నేతలు ముడిపెడుతున్నారు. గీతం వర్సిటీ భూముల వ్యవహారంలో తనకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకే అప్పట్లో మేయర్ మార్పునకు భరత్ పావులు కదిపారన్నది వారి ఆరోపణ. ఆ తర్వాత గీతం భూముల అంశానికి సంబంధించి జీవీఎంసీలో తీర్మానాలు ఆమోదం పొందడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. తాజా పరిణామాల్లోనూ నగర పాలనపై తన పట్టును పెంచుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోందని విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్యేల అభ్యంతరాలనూ ఖాతరు చేయలేదా?
ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఇప్పటికే తారస్థాయికి చేరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమకు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకుండా భరత్ అడ్డుపడుతున్నారని కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపికపై స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎంపీ వెనక్కి తగ్గలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ అండతోనే తన నిర్ణయాన్ని అమలు చేయించుకున్నారనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉందని సమాచారం.
నగర ప్రయోజనాల సంగతేంటి?
శ్రావణి మేయర్‌గా ఎన్నికైతే జీవీఎంసీ నిర్ణయాలపై ఎంపీ భరత్ ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని కొందరు కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నగర భూములు, వనరులు, అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ప్రజాప్రయోజనాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. మేయర్ పదవి వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలకు వేదిక కాకుండా, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే వ్యవస్థగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎంపిక వెనుక నిజంగా రాజకీయ ఆధిపత్య వ్యూహమే ఉందా? లేక పార్టీ అంతర్గత విభేదాలే ఈ విమర్శలకు కారణమా? అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఈ పరిణామాల మధ్య జీవీఎంసీ పాలనలో పారదర్శకత, నగర ప్రయోజనాల పరిరక్షణ కీలకంగా మారాయి.


