రిజర్వేషన్లపై జవాబివ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై జవాబివ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Published Mon, Apr 29 2024 4:25 AM

CM Revanth Reddy Comments On BJP PM Narendra Modi

ఆ తర్వాతే రాష్ట్రానికి మోదీ రావాలి  

మల్కాజిగిరి కార్నర్‌ మీటింగుల్లో సీఎం రేవంత్‌రెడ్డి

పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో ప్రధాని చెప్పాలి 

బీజేపీ నేతలు దేవుళ్ల పేర్లు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు 

ఓట్ల కోసం కేసీఆర్‌ కొంగ జపం చేస్తున్నారంటూ ఫైర్‌

ఎల్‌బీనగర్‌/అల్వాల్‌ (హైదరాబాద్‌):  ‘కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలి. ఈ నెల 30న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. ముందుగా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో, బయ్యారం ఉక్కు పరిశ్రను, ఖాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. 

ఆ తర్వాతే రాష్ట్ర పర్యటనకు రావాలి. పది సంవత్సరాలు ప్రధాన మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గం తనకు రాజకీయంగా తోడ్పాటును అందించిందని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను బాధ్యత వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు 30 వేల మెజార్టీ ఇచ్చి పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని వనస్థలిపురం సుష్మా చౌరస్తా నుంచి రైతు బజారు చౌరస్తా వరకు సీఎం రోడ్డు షో నిర్వహించారు. రాత్రి అల్వాల్‌ సమీపంలోని కౌకూర్‌లో జరిగిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్నర్‌ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. 

బీజేపీని బహిష్కరించాలి 
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించిన బీజేపీని బహిష్కరించాలి. రోడ్లపై దేవుళ్ల బొమ్మలు పెట్టుకుని కొందరు పొట్టకూటి కోసం అడుక్కుంటుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నారు. బీజేపీ పుట్టక ముందునుంచే, తాతముత్తాల కాలం నాటి నుంచే శ్రీరామ నవమిలు, హనుమాన్‌ జయంతిలు జరుపుకున్నాం. బతుకమ్మలు ఆడాం. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మలకు కల్లు సాక పోశాం. కోళ్లను కోసి భక్తిని చాటుకున్నం..’అని రేవంత్‌ చెప్పారు. 

బీజేపీ నేతలు ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నారా? 
‘ఎల్‌బీనగర్‌లో ఎప్పుడు వర్షం వచ్చినా మనుషులు కొట్టుకుపోవడం, వాహనాలు మూసీలో కొట్టుకుపోవడం చూస్తుంటాం. ఈ సమస్యలు పరిష్కరించాలంటే సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలి. నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రో ఏర్పాటు చేస్తాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు ఎప్పుడైనా సమస్యల పరిష్కారానికి వచ్చారా? ఇప్పుడు పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశాడా? గతంలో వర్షాలు వచ్చినప్పుడు మూíసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. బండి పోతే బండి, లారీ పోతే లారీ ఇప్పిస్తానని చెప్పారు. అయన నుంచి బండి రాలే గుండు రాలేదు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అబివృద్ధికి నయా పైసా తేలేదు..’అని సీఎం విమర్శించారు.  

కారు పార్టులు జుమ్మెరాత్‌ బజార్‌లో అమ్మేశారు 
‘కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా ఉండి సచివాలయానికి రాకుండా, ఫాం హౌస్‌లో ఉంటూ ప్రజలను కలవనందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో తిరుగుతున్నారు. ఓట్ల కోసం కొంగ జపం చేస్తున్నారు. కారు పని అయిపోవడంతో కారు దిగి, బసు ఎక్కి మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కారు పని అయి పోయి షెడ్డుకు పోయింది. అక్కడ పార్టులు పార్టులుగా విడదీసి జుమ్మెరాత్‌ బజారులో అమ్మేశారు. పదేళ్లు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారు. కారుకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే. 

బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూస్తున్నాయి. ఇందుకు నిదర్శనం బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తాడని మాజీ మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా అనడమే..’అని రేవంత్‌ అన్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలుపొందితే మంత్రి అయ్యేవారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీసీ జనాభాను లెక్కిస్తున్నామని, ఎల్‌బీనగలో మూసి ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. 118 జీఓ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అబివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement