చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం! | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!

Published Sat, May 25 2024 5:37 PM

AP Elections 2024: Tension For Chandrababu Naidu Kuppam

నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే  ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు  ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.

కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్‌లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు.   

కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.

కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్‌ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్‌ కల్పించారు. వైఎస్ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్‌ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement