ఈసీకి వైఎస్సార్‌సీపీ కీలక లేఖ | All Voters Registered By July 15 Should Be Given Right To Vote: YSRCP | Sakshi
Sakshi News home page

ఈసీకి వైఎస్సార్‌సీపీ కీలక లేఖ

Oct 10 2026 7:11 PM | Updated on Oct 10 2026 7:25 PM

All Voters Registered By July 15 Should Be Given Right To Vote: YSRCP

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటరు జాబితాలో చట్టబద్ధంగా నమోదైన అర్హులైన పౌరులందరినీ స్థానిక ఓటర్ల జాబితాలో చేర్చి, వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను (ఎస్‌ఈసీ) కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఒక  లేఖ రాశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి పాత ఓటరు జాబితాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, ఆ తర్వాత జూలై 15 వరకు నియమనిబంధనల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్న వేలాది మంది అర్హులైన ఓటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోతారని ఆ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం కల్పించేలా, సంబంధిత అనుబంధ మార్పులతో కూడిన తాజా జాబితాను తగినంత ముందుగానే ప్రచురించాలని ఆయన ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఇంకా లేఖలో ఏయే అంశాలు ప్రస్తావించారంటే..

జూలై 15 వరకు నమోదైన ఓటర్లను పరిగణనలోకి తీసుకోవాలి: 
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం, 2026 జూలై 15వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో నమోదైన అర్హులైన ఓటర్లందరినీ స్థానిక సంస్థల ఎన్నికల జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రారంభమైన తేదీగా పేర్కొన్న 2026 జూలై 15వ తేదీ తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ నిలిపివేయబడినట్లు భావిస్తున్నాం. కాబట్టి ఆ తేదీ వరకు నమోదైన వారిని తప్పనిసరిగా చేర్చాలి.

ఫిబ్రవరి 5 నాటి పాత జాబితాతో అన్యాయం: 
ఈ ఎన్నికల కోసం కేవలం 2026 ఫిబ్రవరి 5వ తేదీ నాటి ఓటరు జాబితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తేదీ వరకే జాబితాను పరిమితం చేయడం వల్ల, 2026 జూలై 15 వరకు భారత ఎన్నికల సంఘం రికార్డుల్లో చట్టబద్ధంగా పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత జాబితాలో చేరిన పౌరులందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు.

ప్రజాస్వామ్య హక్కును కాలరాయవద్దు: 
ఈ ఓటర్లందరూ నిర్దేశిత నమోదు ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. వారి పేర్లు ఇప్పటికే అధికారిక ఓటరు రికార్డుల్లో నమోదై ఉన్నాయి. తదనంతరం ఆమోదించబడిన చేర్పులను పరిగణనలోకి తీసుకోకుండా, పాత ఓటరు జాబితాతోనే ముందుకు వెళ్లడం వల్ల అర్హులైన పౌరులు తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోవలసి వస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే సమాన అవకాశం ప్రతి అర్హుడైన ఓటరుకూ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది.

స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి, జాబితాను ముందే ప్రచురించాలి: 
ఈ నేపధ్యంలో 2026 జూలై 15వ తేదీ వరకు నవీకరించబడిన ఓటరు జాబితాలను, సంబంధిత అనుబంధంగా ఆమోదించబడిన మార్పులతో సహా వెంటనే స్వీకరించాలి. క్షేత్రస్థాయి అధికారులకు ఈ అంశంపై స్పష్టమైన, ఏకరూప మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు, నవీకరించిన స్థానిక సంస్థల ఓటరు జాబితాలను తగినంత ముందుగానే ప్రచురించాలి.  తద్వారా ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడంతో పాటు, ఏవైనా పేర్లు గల్లంతై ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుందని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement