సంబరంగా సైనిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం | Sakshi
Sakshi News home page

సంబరంగా సైనిక్‌ స్కూల్‌ వార్షికోత్సవం

Published Sat, Dec 23 2023 4:36 AM

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న 
విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.జి.కృష్ణ  - Sakshi

విజయనగరం రూరల్‌: కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సంబరంగా సాగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల పూర్వవిద్యార్థి, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.జి.కృష్ణ హాజరయ్యారు. పాఠశాల ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులనుద్ధేశించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. క్రమశిక్షణతో రాణించి పాఠశాల పేరు ప్రఖ్యాతులను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప జేయాలని పిలుపునిచ్చారు. క్రీడలు, విద్య, ఇతర రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందన్నారు. సైనిక పాఠశాల విద్యార్థులు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో చేరడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో విద్యనభ్యశించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం, సుందరమైన క్రీడా మైదానాలు, ఉత్తమ ఉపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సైనిక పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పాఠశాల అథ్లెటిక్‌ మీట్‌, విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, షీల్డ్‌లను అందజేశారు. సైనిక పాఠశాల అభివృద్ధి, విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రిన్సిపాల్‌, గ్రూప్‌కెప్టెన్‌ ఎస్‌ఎస్‌ శాస్త్రి ఆయనకు వివరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా విద్యా

ర్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు, సాహస క్రీడలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేశవన్‌, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలి: విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ కె.జి.కృష్ణ

Advertisement
Advertisement