Sakshi News home page

వైభవం.. కల్యాణోత్సవం

Published Mon, Apr 15 2024 2:00 AM

- - Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో షష్టిని పురస్కరించుకుని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై ఉత్సవ మూర్తులకు ఆలయ వైదిక కమిటీ సభ్యుడు యజ్ఞనారాయణ శర్మ, అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో కేఎస్‌ రామరావు, పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి వారికి తలంబ్రాలను సమర్పించగా, ఆ తర్వాత తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్‌ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

అత్యుత్తమ

విద్యాసంస్థ ‘ఇగ్నో’

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించే విద్యాసంస్థల్లో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మొదటిదని ఆ సంస్థ విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీఆర్‌ శర్మ అన్నారు. కేబీఎన్‌ కళాశాల ఇగ్నో స్టడీ సెంటర్‌ నూతన విద్యార్థుల ఇండక్షన్‌ మీటింగ్‌ ఆదివారం ఆ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ డీఆర్‌ శర్మ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో ఇగ్నోకు ప్రత్యేక స్థానముందన్నారు. డెప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ఇగ్నో అనుసరించే బోధనా పద్ధతులు, ఇతర నిర్వహణ తదితర అంశాల ద్వారా యూజీజీ నాక్‌ నుంచి ఏ డబుల్‌ప్లస్‌ గ్రేడ్‌ను సాధించి ప్రమాణాల విషయంలో అగ్రగామిగా ఉందన్నారు. స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ ఎన్‌. సాంబశివరావు, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్లు డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరావు, రీజనల్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పీఎల్‌ రమేష్‌ పాల్గొన్నారు.

కార్టూన్లు సామాజిక చైతన్యం కలిగించాలి

విజయవాడ కల్చరల్‌: కార్టూన్లు సామాజిక చైతన్యం కలిగించాలని దుర్గామమల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు అన్నారు. పాలపర్తి రాజగోపాల్‌ ఉమాదేవి స్మారక కమిటీ, ఎన్‌సీసీఎఫ్‌ విశాఖపట్నం ఆధ్వర్యంలో సూర్యారావు పేటలోని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రాంగణంలోని ఎమెస్కో సాహిత్య వేదికపై ఆదివారం ఉగాది కొసమెరుపు మినీ హాస్యకథల పోటీ, కార్టూన్లు పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. అలాగే నాగిశెట్టి కార్టూన్లు ఆవిష్కరణ, 2024 సంవత్సరానికి గానూ సాహితీవేత్త భావరాజు పద్మినీ ప్రియదర్శినికి బంగార్తల్లి పురస్కార ప్రదానం చేశారు. రామారావు మాట్లాడుతూ కార్టూన్లు హాస్యానికి పెద్దపీట వేస్తూ సామాజిక చైతన్యం కలిగించాలని సూచించారు. కేబీఎన్‌ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ టి. శ్రీనివాస్‌ మట్లాడుతూ కవులు రచయితలు సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.

ఆధునిక చిత్రకళలో మార్పులను స్వాగతించాలి

విజయవాడకల్చరల్‌: ఆధునిక చిత్రకళలో వస్తున్న మార్పులను స్వాగతించాలని ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎస్‌ఎం పిరాన్‌ అన్నారు. చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా స్వరాజ్య మైదానంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చిత్ర కళాంజలి పేరుతో చిత్ర కళా ప్రదర్శన, చిత్రకారులకు సన్మానం, విగ్రహ రూప శిల్పి శివప్రసాద్‌ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. చిత్రకారుడు పిరాన్‌ చిత్ర కళా ఆధునికత అంశంగా ప్రసంగించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కె.బాలయోగి మాట్లాడుతూ భారతీయ చిత్రకళ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. జాయింట్‌ సెక్రటరీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య ద్వారా బాల బాలికలకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. చిత్ర కళావర్క్‌షాప్‌లో 30 మంది చిత్రకారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement