సాక్షి, న్యూఢిల్లీ: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా టీ, అల్లుడితో పాటు ఇతరులపై ఉన్న సీఎంఆర్‌ఎల్–ఎక్సాలోజిక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును వారం రోజుల పాటు నిలిపివేసింది. ఈ మేరకు నేడు (బుధవారం) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చట్టబద్ధ అధికారాల పరిధిలోనే పనిచేయాలని, ఇతర దర్యాప్తు సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా స్పష్టం చేసింది.
“మీరు చట్టం ప్రకారం మీ విధులను నిర్వర్తించండి. ఇతర దర్యాప్తు సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకునేలా మీ పరిధిని విస్తరించవద్దు” అని జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి వ్యాఖ్యానించారు. కేరళ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పినరయి విజయన్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్ నమోదును నిలిపివేయలేదని, తదుపరి దర్యాప్తును మాత్రమే వారం రోజుల పాటు నిలిపివేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో తమ వాదనలు వినిపించుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
ఈ కేసులో ప్రభుత్వ రంగ సంస్థ సీఎంఆర్‌ఎల్.. విజయన్ కుమార్తె వీణాకు చెందిన ఎక్సాలోజిక్ సొల్యూషన్స్ సంస్థకు 2017 నుంచి 2020 మధ్యకాలంలో రూ.2.78 కోట్లకు పైగా చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఎలాంటి సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ సమాచారంతో రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
తాజా ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి, అక్టోబర్ 23న విచారణకు హాజరుకావాలని విజయన్‌కు సమన్లు జారీ చేసినట్లు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఈడీ నమోదు చేసిన తాజా కేసుపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాప్రతినిధులపై దర్యాప్తు ప్రారంభించే ముందు వర్తించే చట్టపరమైన నిబంధనలు, ఎఫ్‌ఐఆర్ నమోదుకు సంబంధించిన విధివిధానాలను హైకోర్టు పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. అయితే ఈ కేసులోని అంశాలపై తుది అభిప్రాయం మాత్రం వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: బిష్ణోయ్ కేసు.. కేంద్రం నిబంధనలు అతనికి ఎలా ప్లస్ అవుతున్నాయి?


