బిష్ణోయ్‌ కేసు.. కేంద్రం నిబంధనలు అతనికి ఎలా ప్లస్ అవుతున్నాయి? | Why cant police bring Lawrence Bishnoi from jail | Sakshi
Sakshi News home page

బిష్ణోయ్‌ కేసు.. కేంద్రం నిబంధనలు అతనికి ఎలా ప్లస్ అవుతున్నాయి?

Oct 21 2026 5:48 PM | Updated on Oct 21 2026 6:16 PM

Why cant police bring Lawrence Bishnoi from jail

ముంబై: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విచారించేందుకు ముంబై పోలీసులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి అతడిని బయటకు తీసుకెళ్లకూడదంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు కారణం. ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనతో మరోసారి బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరపైకి రావడంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కేంద్ర హోంశాఖ 2023 ఆగస్టులో CrPC సెక్షన్ 268 కింద ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 303 కింద వీటిని పునరుద్ధరించింది. దీంతో కోర్టు వారెంట్లు జారీ చేసినా దర్యాప్తు సంస్థలు కస్టడీ కోరినా బిష్ణోయ్‌ను మాత్రం జైలు నుంచి తరలించడం సాధ్యం కావడం లేదు. జైలు ప్రాంగణంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే అతడిని విచారించే అవకాశం ఉంది. ఇదే తరహా రక్షణ గతంలో అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు కూడా కల్పించారు. బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌కు సైతం ఇలాంటి రక్షణ ఉంది.

బాంద్రా (వెస్ట్) బ్యాండ్‌స్టాండ్‌లోని సల్మాన్ ఖాన్ నివాసంలో కాల్పులు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య, దర్శకుడు రోహిత్ శెట్టికి బెదిరింపులు వంటి ఘటనల్లో బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా అక్టోబర్ 18న జుహులో బాలీవుడ్‌ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తమదే బాధ్యతంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ కేసులో అనుమానితులను పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అయితే బిష్ణోయ్‌ను నేరుగా విచారించలేకపోవడంతో కుట్ర వెనుక ఉన్న పూర్తి వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌కు కల్పించిన రక్షణను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చదవండి: కారుతో ఢీకొట్టడంతో.. తీవ్ర గాయాలతో రెండు కాళ్లు కోల్పోయిన ఎంపీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement