‘ఓటును రక్షించండి, దేశాన్ని కాపాడండి’.. రాహుల్ పిలుపు | Rahul Gandhis call for INDIA blocs November 1 mega rally | Sakshi
Sakshi News home page

‘ఓటును రక్షించండి, దేశాన్ని కాపాడండి’.. రాహుల్ పిలుపు

Oct 25 2026 12:14 PM | Updated on Oct 25 2026 12:50 PM

Rahul Gandhis call for INDIA blocs November 1 mega rally

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ‘ఓటు చోరీ’ ఆరోపణలు చేస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువకులు, వ్యాపారులు అందరూ తరలిరావాలని కోరారు.

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించారని, నిబంధనలు ఉల్లంఘించారని, ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీచార్జీలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్లు దొంగిలిస్తున్నారని, ఏ పరిస్థితుల్లోనూ దీన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మార్చ్ గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఆయన వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలు జరిగాయని ‘ఓటు చోరీ’కి పాల్పడ్డారంటూ నిరసిస్తూ నిర్వహిస్తున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్ ముగింపు వేడుకగానే ఈ మెగా ర్యాలీ ఉంటుందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఈ ర్యాలీలో కనీసం లక్ష మందికి పైగా పాల్గొంటారని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది బలమైన సందేశాన్ని ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

మరోవైపు నవంబర్ 1న ఈ ర్యాలీ నిర్వహించడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల క్షతగాత్ర హృదయాలపై రాహుల్ గాంధీ ఉప్పు చల్లుతున్నారని, సిక్కుల మనోభావాలతో క్రూరమైన చెలగాటం ఆడుతున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. అంతేకాకుండా ఈ మార్చ్ వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని కొన్ని వ్యాపార వర్గాలు కోరినప్పటికీ రాహుల్ గాంధీ పట్టించుకోకుండా దీన్ని కొనసాగిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

ఇదీ చదవండి: ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ మన లక్ష్యం: ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement