న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన 139వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి ‘వోకల్ ఫర్ లోకల్’(స్థానికంగా తయ్యారయ్యే ఉత్పత్తులను ఆదిరించడం), ‘ఆత్మనిర్భర్ భారత్’ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం విజయదశమి రోజున ప్రారంభమైన ఈ ప్రయాణం, సమాజ అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న వారిని అభినందించడానికి తనకు ఒక గొప్ప వేదికగా మారిందని మోదీ పేర్కొన్నారు.
పంజాబ్ వ్యవసాయ విధానాలు భేష్
ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన కొన్ని విశేషాలను కొనియాడారు. పంజాబ్‌లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ సాంప్రదాయ పద్ధతులను అమలు చేస్తున్న ‘ఖేతి విరాసత్ మిషన్’ పాత్రను ఆయన ప్రశంసించారు. అలాగే, మాల్వా ప్రాంతంలో సహజ పత్తి సాగును ముందుకు తీసుకువెళ్తున్న ‘నవ్-త్రింజన్’ఉద్యమాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు.
ఐఐటీ మద్రాస్ బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీ
వైద్య, సాంకేతిక రంగాల పురోగతిని ప్రధాని ప్రస్తావిస్తూ.. ఐఐటీ మద్రాస్ 'పరమ్ శక్తి' సూపర్‌కంప్యూటర్ సహాయంతో ఒక ప్రపంచ స్థాయి బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేసిందని అన్నారు. దీని ద్వారా అత్యంత స్పష్టమైన హై-రిజల్యూషన్ డిజిటల్ 3డీ చిత్రాలను రూపొందించి, సుమారు 100 మానవ మెదళ్లను సూక్ష్మంగా అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రాణాలను కాపాడే అవయవదానంపై ముందుకు రావాలని ప్రజలను కోరారు. ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’లు సామాన్యులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నాయని వివరించారు.
పండుగ శుభాకాంక్షలు
అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ‘ఏక్తా దివస్’ సందర్భంగా దేశ ఐక్యతను చాటే ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ దైనందిన ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు. వాల్మీకి రామాయణం కరుణ, సేవ, సామాజిక సామరస్యాల విలువలను బోధిస్తుందని తెలిపారు. చివరగా, దేశ ప్రజలందరికీ రాబోయే దీపావళి , ఛత్ పూజ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఆరోగ్యంగా, కుటుంబంతో కలిసి సురక్షితంగా పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: Delhi: యమునపై విషపు నురగ.. పడిపోయిన గాలి నాణ్యత!


