నేను స్త్రీ ద్వేషినా.. మీరు చేసిందేంటి? | Kalyan Banerjee takes on Mahua Moitra | Sakshi
Sakshi News home page

Kalyan Banerjee: నేను స్త్రీ ద్వేషినా.. మీరు చేసిందేంటి?

Jun 30 2025 8:08 PM | Updated on Jun 30 2025 9:09 PM

Kalyan Banerjee takes on Mahua Moitra

నేను స్త్రీ ద్వేషినా? మ‌రి ఆమె చేసిందేంటి? అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియ‌ర్ నేత‌, ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ ఫైర్ అయ్యారు. ఆయ‌న అంతలా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ప్ర‌త్య‌ర్థుల‌పై కాదు.. సొంత పార్టీ మ‌హిళా ఎంపీపైనే. ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిన మ‌హువా మొయిత్రాపై ఆయ‌న తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేస్తూ నోరు పారేసుకున్నారు. క‌ళ్యాణ్ బెన‌ర్జీ ఎందుకంత కోపంతో ఊగిపోయారంటే..?

జూన్ 25న‌, సౌత్ కల‌క‌త్తా లా కాలేజీలో విద్యార్థిపై దుండ‌గులు దారుణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై క‌ళ్యాణ్ బెన‌ర్జీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 'స్నేహితురాలిని స్నేహితుడే చెర‌బ‌డితే మేమేం చేయ‌గ‌లం. యువ‌తులు ఎలాంటి వారితో తిరుగుతున్నారో గ‌మ‌నించుకోవాలి. బెంగాల్‌లో ప్ర‌తి చోట మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం సాధ్యం కాద'ని వ్యాఖ్యానించారు. క‌ళ్యాణ్ బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌ను ఎక్స్ వేదిక‌గా మ‌హువా మొయిత్రా ఖండించారు. 'భారతదేశంలో స్త్రీ ద్వేషం పార్టీలకు అతీతంగా ఉంటుంది. మిగ‌తా పార్టీల‌తో టీఎంసీని వేరు చేసే విషయం ఏమిటంటే, ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము ఖండిస్తామ‌'ని మొయిత్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మొయిత్రా వ్యాఖ్య‌ల‌పై క‌ళ్యాణ్ బెన‌ర్జీ అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

చ‌ద‌వండి: ఖర్గేజీ.. అంతా హైకమాండ్‌ చేతుల్లోనే ఉందా?

మొయిత్రా వ్య‌వ‌హార శైలి పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌ని బెన‌ర్జీ విమ‌ర్శించారు. కలిగంజ్ ఉప ఎన్నికల సమయంలో త‌న‌ను ప్ర‌చారం చేయ‌నీయ‌కుండా ఆమె అడ్డుకున్నార‌ని ఆరోపించారు. మ‌హిళ‌ల గురించి మాట్లాడుతున్న ఆమె.. పార్టీలో మహిళా నాయకులను ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే మొయిత్రా, బెన‌ర్జీ మ‌ధ్య విభేదాలు కొత్త కాదు. గ‌తంలోనూ వీరిద్ద‌రూ బ‌హిరంగంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement