గాంధీనగర్: గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో కాలు జారి కిందపడటంతో అక్కడ ఉన్న ఇనుప చువ్వ అతడి నోటిలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం అందించారు.
ఆసుపత్రిలో వైద్యులు బాలుడిని పరీక్షించగా, ఇనుప చువ్వ దంతాలు, దవడకు సమీపంలో లోతుగా ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతం సున్నితమైనది కావడంతో చువ్వను తొలగించడం వైద్యులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు దంత వైద్యుడి సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. వెంటనే వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి శస్త్రచికిత్స ప్రారంభించారు.
దాదాపు 40 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. బాలుడి దవడకు లేదా చుట్టుపక్కల కణజాలానికి నష్టం కలగకుండా వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఇనుప చువ్వను తొలగించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడికి తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం లభించింది. అతడి ప్రాణాలను కాపాడగలిగారు.
ఈ ఘటన నేపథ్యంలో చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లో లేదా నివాస సముదాయాల్లో ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని దంత వైద్యుడు డాక్టర్ డి.ఎస్. సోధా సూచించారు. రాధన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ప్రైవేటు వైద్యుల సత్వర స్పందనతో బాలుడి ప్రాణాలు నిలిచాయి. చిన్నారులు ఆడుకునే ప్రాంతాల్లో బయటకు పొడుచుకొచ్చిన ఇనుప చువ్వలు, ఇతర ప్రమాదకర వస్తువులు లేకుండా చూసుకోవడం ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో కీలకం.
ఇదీ చదవండి: దసరా పోస్టర్.. రావణుడి పది ముఖాల్లో ఒకటిగా ఎలాన్ మస్క్


