బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కూడా..
సెన్సస్ నిబంధనలు–1990కి కేంద్రం సవరణ
తాజాగా కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే జనగణన (సెన్సస్) ప్రక్రియలో ఎన్యుమరేటర్లుగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే గుమాస్తాలు, అధికారులను కూడా వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సెన్సస్ నిబంధనలు–1990కి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను హోం శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఈ నెల 16వ తేదీన జారీ చేసింది. 1948 సెన్సస్ చట్టంలోని సెక్షన్ 18 సబ్–సెక్షన్ (1) కల్పించిన అధికారాల మేరకు తీసుకువచ్చిన తాజా నిబంధనలను సెన్సస్ (సవరణ) నిబంధనలు–2026గా వ్యవహరించనున్నారు. అధికారిక గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు.
సెన్సస్ నిబంధనలు–1990లోని రూల్ 3లో ఉన్న టేబుల్ సీరియల్ నంబర్ 5కి ఎదురుగా కాలమ్ 2లో ఉన్న ఎంట్రీలను తాజా సవరణల ద్వారా మార్చారు. కొత్త నిబంధనల ప్రకారం జనగణన విధుల్లో ఎన్యుమరేటర్లుగా.. ప్రభుత్వ, స్థానిక సంస్థలతో పాటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రైవేటు విద్యా సంస్థలు, సొసైటీలు, ట్రస్టులకు చెందిన ఉపాధ్యాయులు...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల గుమాస్తాలు, అధికారులు... ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు), చట్టబద్ధమైన సంస్థలు, బ్యాంకులు, కంపెనీలు, ఇతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల్లో పనిచేసే సిబ్బంది... ఎన్యుమరేటర్ విధులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంత యంత్రాంగం తగినదిగా భావించే ఏ వ్యక్తినైనా నియమించుకునేందుకు వీలు ఏర్పడింది.


