సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు తేదీని కోరుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడుతూ.. తాము పోలీసులకు 24 గంటల సమయం ఇస్తున్నామని, ఒకవేళ వారు స్పందించకపోతే మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని సీజేపీ నేతలు తెలిపారు.
"జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు మేము ఢిల్లీ పోలీసులను తేదీని కోరుతున్నాము. పోలీసులు మాకు తేదీని కేటాయిస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ వారు అలా చేయకపోతే 24 గంటల్లోపు మేము మరో నిర్ణయం తీసుకుంటాము," అని రంకా అన్నారు.
"ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఆంక్షలు, నిషేధాజ్ఞలను పాటించాలని, శాంతిని కాపాడాలని, అనధికారిక గుంపులుగా చేరవద్దని కోరుతూ పోలీస్ స్టేషన్ బయట ప్రజలకు ప్రకటన చేశారు. రాజధానిలో విధించిన భద్రతా ఆంక్షలను కూడా రంకా విమర్శించారు. పండుగలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఏర్పాట్లు స్థానిక నివాసితులు, వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయని" ఆయన అన్నారు.
"ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారాలు మూతపడ్డాయి... పండుగలు కూడా వస్తున్నాయి. నిరసన తెలిపేందుకు మాకు ఒక నిర్దిష్ట స్థలాన్ని ఢిల్లీ పోలీసులు ఎందుకు కేటాయించరు?" అని రంకా ప్రశ్నించారు.
శాంతియుత నిరసన అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు అని CJP నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు. నిరసన ప్రదర్శన కోసం తేదీ, సమయాన్ని ఖరారు చేయాలని పోలీసులను కోరారు.
"శాంతియుత నిరసన అనేది ఒక హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజలు ఇప్పటికే ఆ హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతారు. తాము అనుమతి కోసం 10 రోజుల ముందే సంప్రదించాలని పోలీసులు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నాం. తేదీ, సమయాన్ని వారే చెప్పాలని కోరుతున్నాం. అయితే ఈ విషయాన్ని వారు పెండింగ్‌లో ఉంచేలా మేము అనుమతించము. వారికి 24 గంటల గడువు ఇస్తున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో," అని దాస్ అన్నారు.
అయితే సోమవారం జంతర్ మంతర్‌ను నిరసన ప్రదర్శనల కోసం కేటాయించిన ప్రదేశం జాబితా నుండి తొలగించారు. పౌరులు నిరసనలు నిర్వహించుకోవడానికి వీలుగా ఢిల్లీ పోలీసులు మూడు కొత్త ప్రదేశాలను ప్రకటించారు. అక్టోబర్ 11న జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తూర్పు ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లను నిరసనలు, ప్రదర్శనల కోసం కొత్త వేదికలుగా నిర్దేశించారు.
ఇదీ చదవండి: ఇది శివ తాండవం.. ప్లానింగ్ అవసరం లేదు : రాహుల్ గాంధీ


